జిల్లాలో మాత్రలు వేయాల్సిన పిల్లలు, పాల్గొనే ఉద్యోగుల వివరాలు
● రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ● 1–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● జిల్లాలో 2,89,533 మంది గుర్తింపు
ఖమ్మంవైద్యవిభాగం: పిల్లల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా నులిపురుగుల నిర్మూలనకు ప్రభు త్వం ఈ నెల 13న (సోమవారం) జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్య పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నారు. పిల్లల కడుపులో పెరిగే నులిపురుగులతో రక్తహీనత ఏర్పడి.. రోగనిరోధక శక్తి తగ్గి పలు వ్యాధుల బారిన పడతారు. దీన్ని అరికట్టేలా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించే నులి పురుగుల నివారణ దినోత్సవంలో అంగన్‌వాడీ, విద్యా శాఖ ఉద్యోగులు పాలుపంచుకుంటారు. తొలిరోజైన సోమవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలతో మాత్రలు మింగిస్తారు. ఇక మిగిలిన వారికి ‘మాపప్’ రౌండ్ పేరిట 20వ తేదీన పంపిణీ చేయనుండగా.. కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సరిపడా ఆల్బెండజోల్ మాత్రలను అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ సెంటర్లకు పంపిణీ చేశారు.
వయస్సుల వారీగా..
జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కోసం అర్హులైన పిల్లలను గుర్తించారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 2,89,533 మంది ఉన్నారని తేల్చారు. వీరికి విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం మాత్రలు పంపిణీ చేసి మింగిస్తారు. 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 ఏళ్ల వారికి ఒక మాత్ర ఇస్తారు. చిన్నపిల్లలకు అర మాత్ర పొడిచేసి తాగించాల్సి ఉండగా, మిగతా వారు నమిలి మింగాల్సి ఉంటుంది.
అనారోగ్యం దరి చేరకుండా..
పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటే రక్తహీనత ఎదురవుతుంది. తద్వారా పోషకాహర లోపం ఏర్పడి అలసట, ఎదుగుదల లోపాలు వస్తాయి. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు మట్టిలో ఆడుతున్నప్పుడు, కలుషిత నీరు తాగినప్పుడు, చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆహారం తింటే ఈ పురుగులు కడుపులో ఏర్పడతాయి. ఈ మేరకు పిల్లల చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, కాళ్లకు చెప్పులు ధరించటం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలిస్తే ఒంట్లో శక్తి పెరిగి చదువు, ఆటల్లో చురుగ్గా ఉంటారని చెబుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు 1,618
అంగన్‌వాడీ సెంటర్లు 1,840
1 నుంచి 5 ఏళ్ల వయస్సు పిల్లలు 62,787
6 నుంచి 19 ఏళ్ల వయస్సు విద్యార్థులు 2,26,746
మొత్తం పిల్లలు 2,89,533
పాల్గొననున్న వైద్య శాఖ సిబ్బంది 1,260
ఆశా కార్యకర్తలు 1,339
అంగన్‌వాడీ టీచర్లు 1,739
పాఠశాలలు, కళాశాలల బాధ్యులు 1,618


