● ఖమ్మంలో ‘అరుణోదయ నాగన్న’ సంస్మరణ సభ ● హాజరైన పార్టీలు, సంఘాల నాయకులు, కళాకారులు ● పాటను ఆయుధంగా మలిచారని కొనియాడిన వక్తలు
ఖమ్మంమయూరిసెంటర్: కేవలం వినోదం కోసం కాకుండా, సామాజిక మార్పు కోసం, పీడిత ప్రజల గొంతుకగా తన జీవితాన్ని అంకితం చేసిన అద్భుతమైన ప్రజా కళాకారుడు అరుణోదయ నాగన్న అని వక్తలు కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షణ, సమాజంలో మార్పు కోసం ప్రజలను సంఘటితం చేయడమే మార్గమని నమ్మి పాటను విప్లవోద్యమానికి ఆయుధంగా మలిచిన నాగన్న ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఇటీవల మృతి చెందిన నాగన్న సంస్మరణ సభను ‘నాగన్న మాట – పాటల నివాళి’పేరిట ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు కె.భాస్కర్ అధ్యక్షత వహించగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కళాకారులు పాల్గొని నాగన్న సాదాసీదా జీవితం, ఆయన సైద్ధాంతిక ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎమర్జెన్సీ తర్వాత తరానికి చుక్కాని..
నాగన్న కేవలం సాంస్కృతిక ఉద్యమకారుడే కాదని, ఎమర్జెన్సీ తర్వాతి తరానికి ఒక చుక్కానిలా మార్గదర్శనం చేశారని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, జీవన్, అరుణోదయ విమలక్క తదితరులు వెల్లడించారు. దాదాపు 50 ఏళ్లు ఒకే సిద్ధాంతం, సంస్థకు కట్టుబడి పనిచేసిన అరుదైన, క్రమశిక్షణ కలిగిన నాయకుడని తెలిపారు. హక్కుల కార్యకర్తగా దళిత, పేద, గిరిజన, ఆదివాసీల పక్షాన నిలబడి తన గానంతో సమాజాన్ని చైతన్య పరిచారని పేర్కొన్నారు. రామనరసయ్య అమరత్వం, ఆదివాసీ గూడాల్లో లింగన్న అమరత్వంపై నాగన్న చేసిన ప్రసంగాలు, విప్లవ సింహం వీరగాథల బుర్రకథలు ఉమ్మడి రాష్ట్రంలో నిరక్షరాస్యులైన తొలితరం ప్రజలను మేల్కొలిపాయని తెలిపారు. ఆయన తన కళ, కలాన్ని ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబెట్టారని, జానపద శైలి, లయను నమ్ముకుని తేలికై న పదజాలంతో పాటలు అల్లుతూ భావోద్వేగాన్ని రగిలించారని చెప్పారు. ఆయన ఎప్పుడూ సభలో చప్పట్లు చూసుకోలేదని, ఎంతమంది మెదళ్లను మార్చగలిగామనే తపనతోనే చివరి శ్వాస వరకు జీవించారని గుర్తు చేసుకున్నారు. అయితే, నాగన్న వెనుక బలమైన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గాయకుడిగానే చూస్తే అది అర్థ సంస్మరణే అవుతుందని వక్తలు స్పష్టం చేశారు. కాగా, ప్రశ్నించడమే దేశద్రోహంగా భావించి ఉపా వంటి చట్టాలు ప్రయోగిస్తున్న వేళ నాగన్న దూరం కావడం తీరని లోటని పేర్కొన్నారు. ఇంకా ఈ సభలో పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కోటి, కొమిరే సాకి, యశ్‌పాల్, యోచన, రామనరసయ్య, పి.వెంకన్న, దేవేందర్, దండి సురేశ్, నున్నా నాగేశ్వరరావు, ఆవునూరి మధు, ఆవుల అశోక్, దేవిరెడ్డి విజయ్, బిచ్చాల తిరుమల్‌రావు, టి.వేణు, చిర్ర రవి, విప్లవకుమార్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ సభలో నాగన్న భార్య లక్ష్మక్క, కుమారుడు అజయ్‌తో పాటు సృజన తదితరులు నాగన్న పాటలు పాడి నివాళులర్పించారు.


