ఎన్నికల తర్వాత రాజకీయాలకు
తావులేదు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. ఆతర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచ ఏశారు. ఈక్రమంలో రాజకీయాలకు తావు లేకుండా పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆటోనగర్ నుంచి మద్దులపల్లి మార్కెట్ వరకు రూ.4.50కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు, రూ.2.50కోట్లతో కొత్తూరు నుంచి కాచిరాజుగూడెం వరకు రోడ్డు, స్లాబ్, కల్వర్టు నిర్మాణ పనులకు మంగళగూడెంలో మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే, 64మందికి కళ్యాణలక్ష్మి, 227మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశాక మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో ఈ ప్రాంతానికి రూ.64.92కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్‌కార్డులు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుండగా, గత ప్రభుత్వం విస్మరించినా తాము రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయగా, త్వరలోనే రెండో విడత మంజూరు ఉంటుందని తెలిపారు.
ప్రతీ పేద కుటుంబానికి పథకాలు
తిరుమలాయపాలెం: ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో 12మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 137 మందికి రూ.41.73 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటే పాలేరు నియోజకవర్గంలోని 331 మంది అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ప్రతీ పేద వ్యక్తికి భరోసా, భద్రత కల్పిస్తోందని తెలిపారు. పేదల కోసం పథకాలు అమలుచేస్తూనే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ సేవలు మెరుగపడేలా టీచర్లకు సెల్‌ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. అనంతరం హైదర్‌సాయిపేటలో రూ.1.35 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యాకోబు డీపీఓ రాంబాబు, డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు మేకల సత్యనారాయణ, చీమ్లానాయక్, సుజాత, కన్నేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.


