ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ–అడిక్షన్ సెంటర్) ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ ను డీఎంహెచ్‌ఓ రామారావు శనివారం ప్రారంభించి మాట్లాడారు. మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికి సలహాలు, చికిత్స సాయంతో పాటు పునరావాస మార్గదర్శకత్వం చేసేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక మత్తు పదార్థాలతో ఎదురయ్యే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైతే క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు డీఎంహెచ్‌ఓ బహుమతులు అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్, మానసిక వైద్య నిపుణురాలు సౌమ్య, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, పాలేరు నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.


