ఖమ్మం లీగల్: ఖమ్మం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఖాజా శరత్, జస్టిస్ సూరేపల్లి నందా ప్రారంభిస్తారు. ఈమేరకు ఏర్పాట్లను జిల్లా ప్రధాన జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ శుక్రవారం పర్యవేక్షించారు.
మహిళలకు
ఉపాధి రంగాల్లో శిక్షణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో నిరుపేద, అనాథ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద రిటైల్, సేల్స్ అసిస్టెంట్ రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి సమకూర్చనుండగా పదో తరగతి ఉత్తీర్ణులై 18 – 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అర్హులైన మహిళలు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లను దరఖాస్తుకు జతపరిచి అందించాలని సూచించారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో నేరుగా కానీ 76600 22512, 76600 22513 నంబర్లలో కానీ సంప్రదించాలని విజేత సూచించారు.
జాతీయ సదస్సు ప్రారంభం
నేలకొండపల్లి: నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సును ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాకీరుల్లా ప్రారంభించాక సావనీర్ విడుదల చేశారు. భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యాన ‘ఎకోస్ ఆఫ్ ది పాస్ట్ బీమ్స్ ఆఫ్ లైట్.. ఎక్స్‌ప్లోరింగ్ ది సైంటిఫిక్ పినామినా బిహైండ్ తెలంగాణ ఆర్కిటెక్చర్’ అంశంపై సదస్సులో భాగంగా తొలిరోజు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాల ప్రత్యేకతలను వివరించారు. ప్రిన్సిపాల్ పరంజ్యోతి, అధ్యాపకులు తోటకూర రమేష్, బానోత్‌రెడ్డి, సూర్యనారాయణ, మహంతి, డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు, డాక్టర్ రమేష్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే లాభాల్లోకి ఆర్టీసీ
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా ఆర్టీసీ ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తే సంస్థ లాభాల బాట పడుతుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ తెలిపారు. ఖమ్మం డిపోను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాల్లో పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ప్రతీ ఉద్యోగి తన వంతు బాధ్యతను సమర్థవంతంగా న్విర్తించాలని తెలిపారు. అనంతరం ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లను పరిశీలించిన ఈడీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం డిపో గ్యారేజీలో మెకానిక్ సిబ్బందితో సమావేశమై నిర్వహణపై సూచనలు చేశారు. ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


