జీపీల్లో మల్టీపర్పస్ వర్కర్ల గోస
మూడు నెలల వేతనాల కోసం
2వేల మంది ఎదురుచూపులు
చనిపోయిన, పని మానేసిన వారి పేర్లు తొలగించక సమస్య
ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పస్తులతో పనులు చేయలేక అవస్థ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 589 పంచాయతీల్లో 2వేల మంది మల్టీపర్పస్ వర్క ర్లు ఉన్నారు. గతంలో పని ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల్లోని వర్కర్లకు వేతనాలు నిర్ధారించి పంచాయతీ పద్దు నుంచే చెల్లించేవారు. 2018 నవంబర్ తర్వాత అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందరూ అన్ని రకాల పనులు చేసేలా నిబంధన విధించి ప్రభుత్వమే నేరుగా గ్రీన్ చానల్ ద్వారా నెలకు రూ.9,500 వేతనం ఇస్తోంది. అయితే, తరచూగా నెలల తరబడి వేతనాలు అందడం లేదని మల్టీపర్పస్ వర్కర్లు వాపోతున్నారు.
వెట్టిచాకిరీ చేస్తున్నా..
మల్టీపర్పస్ వర్కర్లు అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారు. వారాంతపు సెలవులు ఉండకపోగా, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా పని చేసినా అదనపు వేతనం కూడా చెల్లించలేదు. గ్రామాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే పారిశుద్ధ్య పనులు మొదలు అంతా వీరే చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో ఎవరైనా మృతి చెందితే సున్నం మార్కింగ్ ఇవ్వడం, భోజనాలు పెడితే విస్తళ్లను ట్రాక్టర్లల్లో డంపింగ్ యార్డుకు తరలించడం, తాగునీటి సరఫరా, పైపులైన్ల మరమ్మతులు, డ్రెయినేజీల శుభ్రత .. ఇలా ఏ పనైనా మల్టీపర్పస్ వర్కర్లే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం రకరకాల సాకులు చూపి వేతనాలు నిలిపేయడం పరిపాటిగా మారింది. నెలలతరబడి వేతనాలు అందక, బయట అప్పు లు పుట్టక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోతున్నారు. కాగా, చనిపోయిన, వేతనాలు చాలక, ఇతరత్రా కారణాలతో పనులు మానేసిన వర్కర్ల పేర్లే ఇంకా ఆన్‌లైన్‌లో కనిపించడం, వారి పేరుతోనేవేతనాలు మంజూరు చేయడంతో కొత్తగా వచ్చిన వారికి చెల్లింపు కష్టంగా మారినట్లు తెలుస్తోంది.


