అత్యాశకు పోతే మొదటికే మోసం..
● రూ.కోట్ల కోసం కొత్త రూట్లు ● బతికుండగానే చంపేస్తున్న వైనం ● ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బీమా మోసాలు
బూర్గంపాడు: ఈజీ మనీ కోసం అన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొందరు రూ.కోట్ల కోసం కొత్త రూట్లు వెదుకుతున్నారు. బీమాను అడ్డుపెట్టుకుని మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. బతికున్న వారి కీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పించి సొమ్ము కాజేస్తున్నారు. మరికొందరు బీమా డబ్బు కోసమే తోటివారిని చంపేస్తున్నారు. హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారు. బీమా మోసాలలో ఏజెంట్లు, కొందరు అధికారులే కీలకంగా వ్యవహరించడం ‘కంచే చేను మేసిన చందంగా’ మారింది. ఇటీవల బీమా మోసాలు, నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండగా బయటకు రాని ఘటనలు మరెన్నో ఉన్నాయి.
పెరుగుతున్న మోసాలు..
జిల్లాలో బీమా మోసాలు, నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పదినెలల క్రితం సారపాకలోని భాస్కర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఒక ఎల్‌ఐసీ ఏజెంట్ పాలసీ చేయించాడు. బీమా పొందిన వ్యక్తి భార్యనే నామినీగా నమోదు చేయించాడు. మూడేళ్ల పాటు పాలసీ నగదు కూడా ఏజెంటే చెల్లించాడు. ఆ తర్వాత పాలసీదారుడు చనిపోయినట్లుగా ఏపీలోని కుక్కునూరులో డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. దాన్ని ఎల్‌ఐసీ కార్యాలయంలో అందించి నామినీ గా ఉన్న పాలసీదారుడి భార్యకు రూ.10లక్షల చెక్కు ఇప్పించాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం బీమా సొమ్ము పంచుకునే విషయంలో విభేదాలు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సదరు ఏజెంట్ నుంచి బీమా సొమ్మును రికవరీ చేసిన ఎల్‌ఐసీ.. ఆ తర్వాత ఏజెంట్‌తో పాటు పాలసీదారుడు, నామినీ, మధ్యవర్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.
హత్య చేసి.. సొమ్ము కాజేసేలా..
బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడిని హతమార్చి, అతడి పేరున రూ. 2 కోట్ల బీమా కాజేసేందుకు ఇద్దరు పథక రచన చేశారు. 23 ఏళ్ల ఆ యువకుడి పేరున రూ.2 కోట్లకు ఓ బ్యాంకులో బీమా చేయించి ప్రీమియం కూడా వారే చెల్లించారు. సదరు బ్యాంకులో ఇన్సూరెన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ యువకుడి ఇంటి పేరు కలిగిన మరో వ్యక్తిని నామినీగా నమోదు చేయించి బీమా సొమ్ము కాజేసేందుకు పథకం రూపొందించారు. ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి ఆ ఇద్దరూ కలిసి యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగాా కొట్టి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఈ వ్యవహారం బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యారు. హత్యయత్నానికి గురైన యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
బూర్గంపాడు/అశ్వాపురం: మండలంలోని సీతా రాంపురం గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్లయిన వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులు తమ బంధువులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి వారి పేరున పెద్దమొత్తంలో బీమా సొమ్ము కాజేశారు. బంధువులతో పాటు మారుమూల గ్రామాల్లోని అమాయకులను నమ్మించి మొత్తం 39 మంది పేరున బీమా చేయించారు. కొంతకాలం ప్రీమియం కూడా వారే చెల్లించారు. ఆ తర్వాత పాలసీదారులు మరణించినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఎల్‌ఐసీ సంస్థకు సమర్పించారు. ఈ క్రమంలో వారికి రూ.1.52 కోట్ల బీమా సొమ్ము అందింది. ఈ సొమ్ములో ఏజెంట్లయిన భార్యాభర్తలు అగ్రభాగం తీసుకుని, కొందరు పాలసీదారులకు కొద్ది మొత్తం అందించినట్లు సమాచారం. అయితే దంపతులైన ఈ ఇద్దరు ఏజెంట్ల నుంచే ఎక్కువగా డెత్ కేసులు వస్తుండగా అనుమానం వచ్చిన ఎల్‌ఐసీ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు తెలుసుకున్నారు. సంస్థను మోసగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగు చూస్తుండగా, చాలా ఘటనలు బయటకు రాకుండానే కొందరు రూ.కోట్లు కొల్ల గొడుతున్నారనే చర్చ సాగుతోంది.


