క్రీడలతో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం
కారేపల్లి: క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి ఉత్సాహంగా ఉంటారని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఖమ్మం, వైరా జోన్ల పరిధి గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులకు మండలంలోని ఉసిరికాయలపల్లి పాఠశాల మైదానంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం ప్రారంభించిన డీడీ మాట్లాడుతూ విద్యార్థులకు తీర్చిదిద్దడంపై దృష్టి సారించే ఉపాధ్యాయులు వారి ఆరోగ్యం కోసం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులకు వాలీబాల్, రన్నింగ్, క్యారమ్స్, చెస్, షాట్‌పుట్ పోటీలు నిర్వహించారు. ఏటీడీఓ రమేష్, ఏసీఎంఓ ఎల్.రాములు, ఏఎస్‌ఓ ఎన్.శంకర్‌రావు, హెచ్‌ఎంలు బి.ధర్మా, వెంకటరమణ, బి.నెహ్రూ, పీఈటీలు రామారావు, వీరన్న, సుష్మిత, శ్రీరామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా : ఎనిమిది మందికి గాయాలు
తల్లాడ: మండలంలోని అన్నారుగూడెం వద్ద గురువారం ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వైరా మండలం కొష్టాల గ్రామానికి చెందిన కూలీలు బి.నరసింహారావుకు చెందిన ఆటోలో మొక్కజొన్న చేనులో పనికి వెళ్తున్నారు. అన్నారుగూడెం సమీపాన కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సమయాన ఆటోలో 15మంది ఉండగా అందులో వై.విశ్వనాధం, వి.నవీన, అలివేలు, శశిమణికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వేటగాడి ఉచ్చులో పడి అడవి పందులు మృతి
కామేపల్లి: మండలంలోని అడవి మద్దులపల్లి గుట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి ఉచ్చులు అమర్చడంలో నాలుగు అడవి పందులు మృతి చెందాయి. కెప్టెన్‌బంజరకు గ్రామానికి చెందిన ఈర్ల వెంకటదాసు అటవీ జంతువుల వేట కోసం ఉచ్చులు అమర్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పందులను తరలించేందుకు వెంకటదాసు యత్నిస్తుండగా, తాళ్లగూడెం సెక్షన్ ఆఫీసర్ శిల్ప ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈమేరకు అడవి పందుల కళేబరాలను పూడ్చిపెట్టి, నిందుతుడిని కోర్టులో హజరుపర్చినట్లు తెలిపారు.
పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ
తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంలో గురువారం మధ్యాహ్నం రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఏలూరి ఝాన్సీ పొలం పనికి వెళ్లగా మధ్యాహ్నం దుండగులు ఇంటి తాళం, లోపల బీరువా తాళం పగులగొట్టి మూడున్నర తులాల చంద్రహారం, 15 తులాల వెండి పట్టీలు, రూ.70 వేలు నగదు చోరీ చేశారు. అలాగే, చీకటి వెంకటయ్య ఇంటి తాళం కూడా పగులగొట్టి వెండి గిన్నెలు, కుంకుమకాయలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో తల్లాడ పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
చింతకాని: మండలంలోని వందనం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కాకరకాయల నరేష్‌ను అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. చింతకాని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. వందనం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఈనెల 15వ తేదీన తిరుమల వెళ్లి 20వ తేదీన వచ్చాడు. అప్పటికే తాళం పగులగొట్టి ఉండడం, ఇంట్లో దాచిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఎల్‌ఈడీ టీవీ, కొంత నగదు చోరీ అయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు విచారణలో భాగంగా గురువారం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గ్రామానికే చెందిన కాకరకాయల నరేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను పట్టుకుని విచారించగా సత్తుపల్లికి చెందిన కందుకూరి సోమాచారితో కలిసి తాను చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఆయన నుంచి చోరీ సొత్తు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు సోమాచారి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్సై లక్ష్మణ్ చౌదరి, ఉద్యోగులు రాములు, శ్రీనివాస్, గజేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలం ఆక్రమణలో 13మందిపై కేసు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఖానాపురంలోని పారిశ్రామిక స్థలం, ఇతర ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించిన ఘటనలో 13 మందిపై ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో స్థలాన్ని కొందరు బుధవారం ఆక్రమించే యత్నం చేశారు. దీంతో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.గౌతమిని సస్పెండ్ చేశారు. ఈమేరకు డీఈఓ చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె సామాజిక మాధ్యమాల కోసం ఇతర రంగాల వీడియోలు చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
క్రీడలతో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం


