ఖమ్మంఅర్బన్: నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మతిస్థిమితం లేని వృద్ధురాలిని చేరదీసిన పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాత ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వృద్ధురాలిని మంగళవారం సాయంత్రం ఏఆర్ ఎస్‌ఐ గుర్తించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఫౌండేషన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారించగా, వృద్ధురాలు మూడు రోజుల క్రితం తప్పిపోయినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ సమక్షంలో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా నుంచి ఐదు నెలల క్రితం వలస కూలీలుగా వచ్చి ఖమ్మం నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివసిస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు, ఎస్‌ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


