పోరాటాల గుమ్మమే వేదిక..
● నేటి నుంచి ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు ● తొలిరోజు భారీ ప్రదర్శన, బహిరంగ సభ ● విద్యారంగ సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థి ఉద్యమ చరిత్రలో మరో కీలక ఘట్టానికి ఖమ్మం నగరం వేదికవుతోంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి. విద్యార్థులు, విద్యార్థిరంగ సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిధులు రానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు 35 మంది, 33 జిల్లాల కమిటీల ప్రధాన బాధ్యులు 320మంది కలిపి 355మంది సభల్లో పాల్గొననున్నారు. అలాగే, ఈ సభల్లోనే రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంటారు.
పూర్తయిన ఏర్పాట్లు
మహాసభల నేపథ్యాన ఖమ్మం నగరం ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయింది. విద్యార్థుల పోరాటస్ఫూర్తి, సంఘం పోరాటాల నినాదాలతో వాల్‌రైటింగ్‌లు చేశారు. సభల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ సెంటర్ నుంచి ప్రదర్శన ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జార్జిరెడ్డి నగర్ (భక్తరామదాసు కళాక్షేత్రం)లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ప్రజానాయకుడు జయరాజ్ తదితరులు ప్రసంగిస్తారు.
రెండో రోజు ప్రతినిధుల సభ
పీడీఎస్‌యూ మహాసభల్లో భాగంగా శనివారం ప్రతినిధుల సభ ఏర్పాటుచేశారు. విద్యావ్యవస్థలోని లోపాలు, ఫాసిజంపై ప్రతిఘటన తదితర అంశాలపై చర్చిస్తారు. అలాగే, ‘ఫాసిజం – విద్యార్థుల కర్తవ్యాలు‘ అంశంపై రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తారు. విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలో ఇక్కట్లపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఈ సభావేదికగా ప్రకటిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.


