సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి
ఖమ్మం సహకారనగర్: గుండెపోటు బాధితులకు తక్షణ వైద్యం అందించే సీపీఆర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన పెట్రోల్ పంప్‌ల యజమానులు, డీలర్లు, సేల్స్ అధికారులు, ఆపరేటర్లకు కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటీవల చాలామంది గుండెపోటు బారిన పడుతున్నందున వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. ఈసమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, వైద్యాధికారులు శ్రీహర్ష, చందన తదితరులు పాల్గొన్నారు.
‘కృషి సఖి’లకు శిక్షణ
వైరా: జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌లో భాగంగా ‘కృషి సఖి’లుగా ఎంపిక చేసిన వారికి జిల్లా వ్యవసాయ శాఖ, వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ‘సహజ వ్యవసాయం’పై ఇచ్చే శిక్షణ వైరా కేవీకేలో గురువారం మొదలైంది. ఆపై వీరు రైతులకు రసాయన ఎరువుల వినియోగంతో నష్టాలు, సహజ వ్యవసాయంతో లాభాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఖమ్మం, వైరా ఏడీఏలు వాసవీరాణి, టి.కరుణశ్రీ, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వగా శాస్త్రవేత్తలు డాక్టర్ వి.చైతన్య, పీఎన్‌ఎం ఫణిశ్రీ, టి.పావని, హార్టికల్చర్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల వేణు పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థికి
రూ.లక్ష ఆర్థికసాయం
కల్లూరు: కల్లూరు మండలం లోకారం గ్రామానికి చెందిన పాగా అక్షయ బీటెక్‌లో రెండో సంవత్సరం చదువుతుండగా ఫీజు కట్టడానికి ఇక్కట్లు ఎదురుకావడంతో నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులు స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుడు వరకా రామారావును ఆశ్రయించారు. దీంతో ఆయన ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్‌కు వివరించగా, ఎన్‌ఆర్‌ఐ సహకారంతో రూ.లక్ష ఇప్పిస్తానని తెలిపారు. ఈ మేరకు గురువారం విద్యార్థిని, ఆమె తండ్రికి రామారావు చెక్కు అందచేయగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెండో రోజుకు చేరిన జేఈఈ మెయిన్స్
ఖమ్మం సహకారనగర్: జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని సిటీ కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌కు 854మందిలో 832మంది, మధ్యాహ్నం పరీక్షకు 858మందికి గాను 851మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు.
నేత్రపర్వంగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, భద్రగిరిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణకర్త, ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి సంగీత కళాకారులు హాజరై ప్రేక్షకులను అలరించనున్నారు.
సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి
సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి


