నేటి నుంచి రామదాసు జయంత్యుత్సవాలు
నేలకొండపల్లి: భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామికి ఆలయాన్ని నిర్మించిన పరమ భక్తాగ్రేసరుడు, వాగ్గేయకారుడైన కంచర్ల గోపన్న(భక్త రామదాసు) జయంతి ఉత్సవాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించనుండగా, భక్త రామదాసు పదో తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు దంపతులు గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే, రామదాసు ధ్యాన మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటలక్ష్మి, పూజారి సౌమిత్రి రమేష్‌తో పాటు కురాకుల ప్రమీల, సామాల కోటేశ్వరరావు, ఇంగువ రామకృష్ణ, పసుపులేటి ఉపేందర్, కురాకుల నాగేశ్వరరావు, చిన్నంశెట్టి రాంబాబు పాల్గొన్నారు.
అంతంత మాత్రంగానే ఏర్పాట్లు
భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లలో ఏటా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నా, దత్తత తీసుకున్న భద్రాచలం దేవస్థానం బాధ్యులు మొక్కుబడిగా సాయం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ, అధికార యంత్రాంగం, భద్రాచలం దేవస్థానంతో పాటు భక్తరామదాసు విద్వత్ కళాపీఠం ఆధ్వర్యాన ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే, భద్రాద్రి ఆలయం ద్వారా ఉత్సవాల నిర్వహణకు చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మందిరానికి ఇప్పుడైనా రంగులు వేయించలేదు. ప్రభుత్వ నిధులు రాకపోవడంతో స్థానికులే చందాలు వసూలు చేయాల్సి వస్తోంది. ఇదే సమయాన ఏర్పాట్లను ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై భద్రాచలం ఆలయ ఈఓ కె.దామోదర్‌రావును వివరణ కోరగా చందాల విషయమై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆడిటోరియంను పూర్తిస్థాయిలో అప్పగించలేదని తెలిపారు.
పట్టువస్త్రాలు సమర్పించిన వారసులు


