కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి
సత్తుపల్లి: సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కలిసి కట్టుగా పనిచేసి విజయఢంకా మోగించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ సూచించారు. సత్తుపల్లిలో గురువారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన అమలువుతున్న పథకాలను ఇంటింటా వివరించాలని సూచించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కాగా, కిష్టారం సైలోబంకర్ నిర్మాణం, అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చర్చకు రావాలని సూచించారు. అనంతరం మండలంలోని 26మందికి రూ.8.69లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, 53మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్, చల్లగుళ్ల నరసింహారావు, తోట సుజలరాణి, చల్లగుళ్ల కృష్ణయ్య, ఎండీ.కమల్‌షాషా, శివా వేణు, గాదె చెన్నారావు, దొడ్డా శ్రీనివాసరావు, పింగళి సామేలు, గొర్లమారి రామ్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


