జలవిహారం
ఉచితంగానే..
శ్రీరాములుతోనే
● 1971 నుంచి కనుల పండువగా తెప్పోత్సవం ● ముఫ్పై ఏళ్లుగా ‘శ్రీరాములు’ లాంచీనే హంసవాహనం ● ఆగమశాస్త్రం ప్రకారం దేవేరుల జలవిహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోల్కొండ నవాబుగా తానీషా ఉన్న 17వ శతాబ్ద కాలంలో భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి ఆలయాన్ని కంచర్ల గోపన్న నిర్మించాడు. 1798లో గోదావరికి అవతలి వైపు ఉన్న భద్రాచలం ఏజెన్సీని బ్రిటీషర్లకు నిజాం రాజులు దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్‌తో సంబంధాలు పలుచబడి రాజ మండ్రితో భద్రాచలానికి సంబంధాలు పెరిగాయి. రాజమండ్రి, భద్రాచలం మధ్య దట్టమైన శంకరగిరి మాన్యాలు (రంపచోడవరం అడవులు) ఉండటంతో ఈ రెండు ప్రాంతాలను గోదావరిపై జల రవాణా వ్యవస్థనే కలిపి ఉంచేది. రాజమండ్రి నుంచి నిత్యావసర వస్తువులు భద్రాచలం ఏజెన్సీకి వస్తే ఇక్కడి నుంచి పంట ఉత్పత్తులు, కలప, లంక పొగాకు తదితరాలు రాజమండ్రికి వెళ్లేవి. అలా స్వాతంత్య్రం వచ్చే సమయానికి భద్రాచలం ఏజెన్సీకి రాకపోకలు సాగించేందుకు రాజమండ్రి కేంద్రంగా పదిహేను వరకు లాంచీలు నడిచేవి. ఉదయం 5 గంటలకు రాజమండ్రిలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు కూనవరం, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలానికి చేరుకునేవి. ప్రస్తుత చప్టా దిగువ ప్రాంతం అంత్యంత రద్దీ మార్కెట్‌గా ఉండేది. సరిగ్గా దీనికి అవతల ఒడ్డున గొమ్మూరు లంగరు ఉండేది.
తెప్పోత్సవం
రామయ్య స్వామికి పంచారాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిత్య పూజలు నిర్వహించేందుకు శ్రీరంగం నుంచి ఐదు శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే కుటుంబాలను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆ సంప్రదాయాలను అనుసరించి ఆరంభంలో తెప్పలో సీతారాములను గోదావరిలో జల విహారానికి తీసుకువచ్చేవారు. బూర్గంపాడు–భద్రాచలం ప్రాంతాలను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మాణం జరిగాక భద్రాచలానికి మేలైన రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చింది. భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో 1971లో భారీ వేడుకగా లాంచీలలో తెప్పోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి క్రమంగా లాంచీ సైజు అలంకరణలో భారీతనం చోటు చేసుకుంటూ వచ్చింది.
అప్పటి నుంచి ‘శ్రీరాములు’
రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత జలరవాణా తన వైభవాన్ని కోల్పోయింది. కేవలం వానాకాలంలో అప్రమత్తతకే లాంచీలు పరిమితమయ్యాయి. 1986 వరదల తర్వాత జూన్ నుంచి సెప్టెంబరు వరకు వరుసగా మూడు నెలల పాటు లాంచీలను ప్రభుత్వం లీజుకు తీసుకునేది. లాంచీలు భద్రాచలం కేంద్రంగా సేవలు అందించేవి. ఈ క్రమంలో శ్రీరాములు లాంచీ 1995లో తెప్పోత్సవంలో భాగమైంది. ఆ ఏడు ఈ లాంచీకి చేసిన హంస అలంకారం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రముఖ ఆలయాల్లో తెప్పోత్సవానికి స్ఫూర్తిని ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శ్రీరాములునే ముక్కోటి పర్వదినానికి ముందు రోజు హంసగా మారుతుంది.
రాముడి సేవలోనే
30ఏళ్లుగా ‘శ్రీరాములు’ రాముడి సేవకే అంకితమైంది. పదిహేను రోజుల పాటు హంస అలంకారం చేస్తారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత అలంకారం తీయడానికి మరో పది రోజుల సమయం పడుతుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఈ లాంచీని నీటి నుంచి బయటకు తీసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతారు. ఆ రోజుల్లో ఈ బోటు తయారీకి రూ. 3లక్షల ఖర్చయింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త బోటు తయారు చేయాలంటే రూ. 1.50 కోటి వరకు ఖర్చు అవుతుంది. ప్రతీ ఏడు వరదల సీజన్‌లో మూడు నెలల పాటు ప్రభుత్వం చెల్లించే లీజు ఆధారంగా లాంచీ నిర్వహణ సాగుతోంది. ఆ తర్వాత భద్రాచలం సమీపంలోనే లంగరు వేసి ఉంటుంది. వినాయకచవితి, దసరా సందర్భంగా విగ్రహాల నిమజ్జనంలో సాయం అందిస్తుంది. ముక్కోటి సమయంలో నెల రోజుల ముందుగా భద్రాచలం పుష్కరఘాట్‌కి తీసుకువస్తారు.
మా నాన్న పేరు సీతారాములు. నా లాంచీ పేరు శ్రీరాములు. మాది రామభక్తుల కుటుంబం. ఆలయ ఈవోగా ప్రేమ్ అనే అధికారి ఉన్నప్పుడు రాముడికి సేవలు చేసి ఫీజు అడుగుతావా అని అడిగాడు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెప్పోత్సవానికి మా లాంచీని ఉచితంగానే అందుబాటులో ఉంచుతున్నాం.
–రామకృష్ణ, లాంచీ యజమాని


