కేఎంసీ.. సరికొత్తగా!
తప్పనిసరి..
● డివిజన్ల పునర్విభజన కోరుతూ సీడీఎంఏకు కమిషనర్ లేఖ ● పెరిగిన జనాభా, ఓటర్లకు అనుగుణంగా మార్పులు ● ఎస్‌ఐఆర్ తర్వాతే డివిజన్ల సంఖ్యపై స్పష్టత
ఖమ్మంమయూరిసెంటర్: రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాలనా సౌలభ్యం కోసం డివిజన్ల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న నివాసాలు, జనాభా, ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డివిజన్ల సరిహద్దులను సవరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య డివిజన్ల పునర్విభజనకు అనుమతి కోరుతూ సీడీఎంఏకు ఇటీవల లేఖ రాశారు. వచ్చే ఏడాది మే నెలలో ప్రస్తుత పాలకవర్గం ముగుస్తుండడం, ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఆలోగానే పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
గతం నుంచి ప్రస్తుతం వరకు..
ఖమ్మం కార్పొరేషన్‌లో చివరిసారి 2021 ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లకు పెంచుతూ గెజిట్ విడుదల చేసింది. ఆ సమయాన కేఎంసీ పరిధిలో 2,81,387 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 1,45,608 మంది, పురుషులు 1,35,734 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. అప్పటి నుంచి 60 డివిజన్ల పరిధిలోనే పాలన కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఓటర్ల సంఖ్య 3.26లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా కూడా 5లక్షలకు పైగా ఉండడంతో డివిజన్ల పునర్విభజన తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, కొత్త డివిజన్లు ఏర్పాటుచేస్తారా, ప్రస్తుతం ఉన్న 60 డివిజన్ల సరిహద్దులనే సవరిస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వ ఆమోదమే తరువాయి
కేఎంసీ నుంచి అధికారులు డివిజన్ల పునర్విభజనకు సంబంధించి సీడీఎంఏకు ప్రతిపాదనలు పంపారు. సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీచేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వార్డుల వారీగా జనాభా లెక్కింపు చేపడతారు. ఆతర్వాత భవిష్యత్ ఎన్నికల నాటికి కొత్త డివిజన్లు ఏర్పాటుచేసే అవకాశముందని చెబుతున్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయితేనే?
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొనసాగుతోంది. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పూర్తయితే కేఎంసీలో ఓటర్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. తద్వారా ఒక్కో డివిజన్‌లో 5,200 ఓటర్లే ఉండేలా మార్పులకు అవకాశముందని సమాచారం. అంటే ఎస్‌ఐఆర్ పూర్తయితేనే మార్పులు, చేర్పులపై స్పష్టత రానుంది. డివిజన్లు పెంచక తప్పని పరిస్థితి ఎదురైతే ప్రస్తుతం ఉన్న 60డివిజన్లకు తోడు కొత్తగా తొమ్మిది డివిజన్లు ఏర్పడే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను వివరణ కోరగా.. సీడీఎంకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కోసం అనుమతి కోరుతూ లేఖ రాశామని వెల్లడించారు. సీడీఎంఏ నుంచి అనుమతి వచ్చాక సర్వే చేపట్టి డివిజన్ల పెంపుపై స్పష్టత వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం 60 డివిజన్లతో ఉన్న ఖమ్మం నగరం విస్తరించడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడుతున్నాయి. కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, మరికొన్నింట్లో తక్కువగా ఉండడంతో డివిజన్ల పరిధి క్రమపద్ధతిలో ఉంటేనే
అభివృద్ధి పనులు, పౌర సేవలు వేగంగా అందించవచ్చనే భావనకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత కొత్తగా వేల సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంతో అంతరాలు
ఏర్పడినట్లు గుర్తించారని సమాచారం.


