ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర: రాష్ట్రమంతా ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఏసుప్రభువును ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలోని బయ్యారం చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. చర్చి నిర్మించి 125ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భట్టి మాట్లాడారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే, ప్రభువు సందేశం ఇచ్చినట్లుగా ప్రతీఒక్కరు ఇతరులకు అండగా నిలవాలని, పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్చి బాధ్యులు, మత పెద్దలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా ‘తనికెళ్ల’
కొణిజర్ల: ఉమ్మడి జిల్లాస్థాయి మైనార్టీ బాలుర గురుకులాల క్రీడాపోటీల్లో తనికెళ్లలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పలు విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియనషిప్ కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి(ఆర్‌ఎల్‌సీ) ఎంజే. అరుణకుమారి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్.జితేష్ సాహిల్, పీడీ ఎం.రవికుమార్, పీఈటీ బండారు సాయికృష్ణతో డిప్యూటీ వార్డెన్ యాకూబ్ పాషా పాల్గొన్నారు.
28న జిల్లాస్థాయి
క్రాస్ కంట్రీ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్ తెలిపారు. అండర్–16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్ –16 బాలబాలికలకు 2 కిలోమీటర్లు, అండర్–18లో బాలురకు ఆరు, బాలికలకు నాలుగు కి.మీ., అండర్–20 విభాగంలో బాలురకు ఎనిమిది కి.మీ., బాలికలకు ఆరు కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. క్రాస్ కంట్రీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈనెల 28 ఉదయం 10 గంటలకల్లా స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.
చర్చి నిర్మాణానికి
రూ.2లక్షల విరాళం
రఘునాథపాలెం: క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చర్చి నిర్మాణానికి గురువారం విరాళం అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఆయన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్మించే చర్చికి రూ.2లక్షల విరాళం అందించగా మతపెద్దలు పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శంకర్, నాయకులు మందడపు నరసింహారావు, మాధవరావుతో పాటు లక్ష్మణ్ నాయక్, క్రాంతి, సంజీవరావు, లాజర్, శ్రీను, విజయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు అర్చక, ఉద్యోగుల సమావేశం
ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగల సమావేశాన్ని ఖమ్మంలోని పవనసుత జలాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంఘం బాధ్యులు దాములూరి వీరభద్రరావు, తోటకుర వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ల సమస్యలు, హెల్త్ కార్డులపై చర్చించనున్న ఈ సమావేశానికి అర్చక, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.
ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి
ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి


