విద్యుత్ శాఖలో బదిలీలు ?
● త్వరలోనే విధివిధానాలు వెల్లడయ్యే అవకాశం ● రెండేళ్లు ఒకేచోట ఉన్న వారికి తప్పనిసరి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై చర్చ మొదలైంది. ఒకేచోట రెండేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే కాక ఫిర్యాదులు ఉన్న వారిని నాన్ పోకల్ పోస్టుల్లోకి మార్చాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. తద్వారా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేసే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులను మూడేళ్లకోసారి బదిలీ చేస్తారు. కానీ ప్రభుత్వం ఈసారి రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకుని బదిలీలకు సిద్ధమైంది. విద్యుత్ సంస్థలో అవినీతి పెరిగిందని, కొత్త సర్వీసుల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, మీటర్ల మార్పు ఇలా అన్ని పనులకు సిబ్బంది డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు కూడా అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు పెరగడంతో ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థానచలనం కల్పించాలని, తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చనే భావనకు వచ్చినట్లు సమాచారం.
జిల్లాలో భారీగా స్థానచలనం
విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకోనుండడంతో ఖమ్మం సర్కిల్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో బదిలీ కావొచ్చని భావిస్తున్నారు. దీర్ఘకాలంగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల్లో పనిచేసే వారు పెదవి విరుస్తున్నారు. ఇక యూనియన్లకు ప్రాతినిధ్యం వహించే నాయకులు ఇదే అదునుగా అనుకూలమైన చోటకు బదిలీ చేయించుకునేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖలో 18 – 19 ఉద్యోగ సంఘాలు ఉండగా కొందరు యూనియన్‌లో కీలక స్థానం ఉన్నట్లు లెటర్ ప్యాడ్లు సృష్టించి ఎంచుకున్న పోస్టింగ్ సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఫలితంగా దూర ప్రాంతాల్లో పనిచేసే పలువురు అక్కడే కొనసాగాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం బదిలీలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ఈ వ్యవహారంలో మార్పులు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఖమ్మం సర్కిల్ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 1,132 మంది ఉద్యోగులు, 250 మంది ఆర్టిజన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో వీరిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఇంజనీర్లు బదిలీ అయ్యే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. అయితే, మార్గదర్శకాలు విడుదలైతేనే ఈ అంశంలో స్పష్టత రానుంది.
విద్యుత్ శాఖలో బదిలీలు ?


