అద్దె పంచాయతీ
గ్రామపాలనలో కీలకమైన పంచాయతీలను సొంత భవనాల కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల సొంత భవనాలు లేకపోగా.. ఉన్నవాటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి. పలు పంచాయతీలను అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 571 గ్రామపంచాయతీలకు గాను 461 పంచాయతీలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా వాటిలో 70 అద్దె భవనాల్లో, 40 ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి.
కొన్ని జీపీల భవనాలకు నిధులు విడుదలైనా నిర్మాణాలు పూర్తికాలేదు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
●అటు కిరాణం.. ఇటు జీపీ
కొణిజర్ల మండలం రాజ్యతండా 2018లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి సర్పంచ్ ఓ ప్రైవేట్ భవనంలో ఐదేళ్ల పాటు పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించగా, ప్రస్తుతం గెలిచిన సర్పంచ్ బానోతు పుష్పావతి ఓ కిరాణం షాపులో నెలకు రూ.3వేల అద్దెతో గది తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
●అద్దె కట్టలేక..
2018లో జీపీగా ఏర్పడిన కూసుమంచి మండలం ధర్మాతండా కార్యాలయాన్ని తొలి ఐదేళ్లు అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అద్దె కట్టలేక మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న భవనంలో నిర్వహిస్తున్నారు. నూతన భవనాన్ని మంజూరు చేస్తేనే సమస్యలు తొలగుతాయని సర్పంచ్ జర్పుల కిరణ్మయి కోరుతున్నారు.
●పాఠశాలే పంచాయతీ కార్యాలయం..
తల్లాడ మండలం అంబేద్కర్‌నగర్ 2019లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడగా అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకలాపాలు కొనసాగాయి. ఐసీడీఎస్‌కు అవసరం కావడంతో ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చారు. విద్యాశాఖకు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ భవనం కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది.
అద్దె పంచాయతీ
అద్దె పంచాయతీ


