పరశురామా.. పాహిమాం
భద్రగిరిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం పరశురామావతారంలో దర్శనమిచ్చారు. తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతుల కార్య వీర్యార్జునుని సంహరించి 21 పర్యాయాలు భూమిని అంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు అవతరించిన ‘పరశురామయ్యకు పాహిమాం’ అంటూ భక్తులు వేన్నోళ్ల కీర్తించారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించాక పరశురామావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు.
కనులపండువగా శోభాయాత్ర
ఉత్సవాల్లో భాగంగా లాడ్జీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేత్రపర్వంగా శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారిని మేళతాళాలు, భక్తుల కోలాటాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియం వేదికపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నాక తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.


