శిల్పారామం నిర్మాణానికి భూమి కేటాయింపు
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేలా నగరంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖానాపురం హవేలీ రెవెన్యూ గ్రామ సర్వే నంబర్లు 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శిల్పారామం నిర్మాణం పూర్తయితే స్థానిక శిల్పులు, కళాకారులు, హస్తకళల కార్మికులకు శాశ్వత వేదిక సిద్ధమవుతుందని అన్నారు. పర్యాటక అభివృద్ధికీ మార్గం ఏర్పడుతుందని చెప్పారు. శిల్పారామంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శిల్పారామానికి ఆకర్షణీయ ముఖద్వారం నమూనా (ఎంట్రెన్స్ గేట్ డిజైన్) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాంస్కృతిక కేంద్రంగా ఖమ్మం గుర్తింపు పొందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి తుమ్మల వెల్లడి


