నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి తల్లాడ మండలం పినపాక వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆతర్వాత పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాలలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం, ఆ తర్వాత జేవీఆర్ ఓసీని పరిశీలించి బొగ్గు ఉత్పత్తిపై సమీక్షించనున్నారు.
ఆలయ నిర్మాణానికి
రూ.6 లక్షల విరాళం
కూసుమంచి: కూసుమంచిలో నిర్మించే రామాలయానికి కూసుమంచి వాసి, నకిరేకల్‌లో స్థిరపడిన బీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్ రూ.6,00,116 విరాళం ప్రకటించారు. ఆలయానికి భారీగా విరాళం ప్రకటించిన ప్రసన్నరాజ్‌ను సర్పంచ్ కొండా కృష్ణవేణితో పాటు గ్రామస్తులు అభినందించి సత్కరించారు. ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, మాజీ సర్పంచ్ చెన్నా మోహన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో డీఎంల బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రీజియన్‌లో సత్తుపల్లి డిపో మేనేజర్ వి.సునీత సూర్యాపేటకు, సూర్యాపేట డీఎం జీ.ఎల్.నారాయణను సత్తుపల్లికి బదిలీ అయ్యారు. అలాగే, మధిర డిపో మేనేజర్ డి.శంకర్‌ను మియాపుర్ డిపో ఏడబ్ల్యూఎం, బీబీయూగా బదిలీ చేశారు. అంతేకాక భద్రాచలంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.రామయ్యకు డిపో మేనేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ మధిర డీఎంగా నియమించారు.
ప్రజల సహకారంతోనే అటవీ వనరుల పరిరక్షణ
ఖమ్మంవ్యవసాయం: అన్నిప్రజల సహకారంతోనే అటవీ వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. కృత్రిమ అటవీ సృష్టికర్త దుశర్ల సత్యనారాయణ సోమవారం ఖమ్మంలో డీఎఫ్‌ఓను కలిశారు. ఈ సందర్భంగా పులిగుండాల వద్ద ఎకో టూరింజం అభివృద్ధి పనులు, జిల్లాలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, వన సంరక్షణ సమితిల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన ఉండాలని తెలిపారు.
టీజీవోస్ ఆధ్వర్యాన క్రిస్మస్
ఖమ్మం సహకారనగర్: రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యాన సోమవారం రాత్రి యూనియన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మోదుగు వేలాద్రి, శేషుప్రసాద్, రాంబాబు, రవీంద్రప్రసాద్, నరేందర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


