సీహెచ్‌పీ ‘ప్రైవేట్’పరం
కార్మికులను సర్దుబాటు చేస్తాం
● టెండర్లలో దక్కించుకున్న ‘ఇనార్గో’ ● ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా.. ● ఆందోళన బాటలో సింగరేణి కార్మిక సంఘాలు
సత్తుపల్లి: సింగరేణి సంస్థలో అత్యంత నాణ్యమైన బొగ్గు వెలికితీస్తున్న సత్తుపల్లి పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ)ను ప్రైవేట్ పరం చేయడంపై కార్మికులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సంస్థ చరిత్రలోనే తొలిసారి ఆరు కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు టెండర్లు పిలవగా ఇప్పటికే ఇనార్గో కంపెనీ చేజిక్కించుకుంది. అంతేకాక సంస్థ బాధ్యులు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టడం గమనార్హం. కానీ టెండర్ల కనీస సమాచారం బయటకు పొక్కకుండా సింగరేణి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సాంకేతిక అద్భుతమని..
కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను రాంచీలోని సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో రూ.398 కోట్ల వ్యయంతో బొగ్గు లోడింగ్ కోసం సత్తుపల్లి మండలం కిష్టారంలో నిర్మించారు. కోల్‌మైన్ ఇండియాకే పరిమితమైన ఇలాంటి ప్లాంట్‌ను తొలిసారి సింగరేని పరిధిలో నిర్మించగా 2022 మే 28 నుంచి రోజుకు 7 – 8 రేక్‌ల ద్వారా సుమారు 30 వేల నుండి 35 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. అయితే, ప్లాంట్ బంకర్‌లో ఏడాదిన్నర క్రితం పగుళ్లు రావటంతో పరిశీలన కోసం యాజమాన్యం కమిటీలను నియమించింది. నిర్మాణం చేపట్టిన సమంతా కంపెనీ నుంచే మరమ్మతు ఖర్చులు రాబడతామని అధికారులు చెబుతున్నా.. కార్యాచరణ అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, బంకర్లను మరమ్మతు చేయించి ప్రైవేట్ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్న అధికారులు.. మరమ్మతులు ఎవరు చేపడుతారో స్పష్టత ఇవ్వడం లేదు.
బదిలీలు తప్పవా?
జేవీఆర్ ఓసీకి అనుసంధానంగా పనిచేస్తున్న సీహెచ్‌పీలో 340 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేట్‌పరం చేయడంతో ఇంజనీరింగ్, టెక్నికల్ సిబ్బంది తప్ప మిగిలిన వారిని ప్రైవేట్ సంస్థే సమకూర్చుకుంటుంది. దీంతో ఇక్కడ కార్మికుల్లో కొందరిని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో సర్దుబాటు చేశాక మిగిలిన వారి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది.
సమ్మెకు వెనుకాడం
సీహెచ్‌పీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవడమే సంస్థే నిర్వహించాలని హెచ్‌ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆందోళనలు చేపట్టడంతో పాటుఅవసరమతే సమ్మెకు వెనుకాడేదని లేదని తెలిపారు. ఈమేరకు సంఘం నాయకులు సోమవారం సత్తుపల్లి జీఎం చింతల శ్రీనివాస్‌కు లేఖ అందజేశారు. ప్రైవేట్ సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని.. అవగాహన లేని కార్మికులను నియమిస్తే ప్రమాదాలకు అస్కారం ఉంటుందని తెలిపారు. హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు వై.ఆంజనేయులు, ఓసీ ఇన్‌చార్జ్ అజ్గర్‌ఖాన్ తదితరులు జీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
అదే తరహాలో..
సీహెచ్‌పీ నిర్మాణ సమయాన ప్రజా ఆమోదం కోసం గ్రామసభ నిర్వహించని అధికారులు ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైలో బంకర్ నిర్మాణ సమయంలో దుమ్ముదూళిపై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు పలువురు శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడ్డారు. అంతేకాక నెలల తరబడి ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులకు ప్రైవేట్ పరం చేసే హక్కు ఎక్కడిదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
సీహెచ్‌పీని నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించాం.
అయినా టెక్నికల్,
ఇంజనీరింగ్ సిబ్బంది
సింగరేణి ఉద్యోగులే
ఉంటారు. అదనంగా ఉన్న కార్మికులను ఇతర ఓసీల్లో సర్దుబాటు చేస్తాం. తొలుత డిప్యూటేషన్‌పై ఉన్నవారిని తిరిగి పంపిస్తాం. పగుళ్ల విషయంలో సమంతా సంస్థ నుంచి జరిమానా వసూలుకు అధికారులు చర్యలు చేపట్టారు.
– చింతల శ్రీనివాసరావు, సత్తుపల్లి ఏరియా జీఎం
సీహెచ్‌పీ ‘ప్రైవేట్’పరం


