పోలీసుల అత్యుత్సాహం
అసలేం జరిగింది..
ఏపీ మాజీ సీఎం పుట్టినరోజున ర్యాలీలో పాల్గొనడమే పాపం
ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయమే కారణమని విమర్శలు
అక్రమ కేసులు బనాయించారు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులపై ఖమ్మం నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా, ఓర్వలేని ఓ పార్టీ నేతల జోక్యంతో పోలీసులు ఏకంగా 11మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. అయితే ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసులు పెట్టారని జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు.
ముందే కవ్వించడంతో..
జగన్ అభిమానుల ర్యాలీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వైపు వెళ్తుండగా టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నేతల వీడియోలను చూపిస్తూ కవ్వింపునకు దిగినట్లు తెలిసింది. అయినా పట్టించుకోకుండా జగన్ అభిమానులు ముందుకు సాగారు. తిరిగి ర్యాలీ వచ్చే సమయాన టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు వద్ద ఉన్న వారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు సమాచారం. దీన్ని తట్టుకోలేని జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినదించగా, ఓ అభిమాని రోడ్డు మీద బైక్‌పై ఉండి స్లోగన్స్ ఇచ్చాడు. దీన్ని ఆసరా చేసుకుని టీడీపీ కార్యాలయ వాచ్‌మన్‌తో ఫిర్యాదు చేయించారు.
కేసు లేదని.. బనాయించి
ర్యాలీ ముగిశాక వైఎస్సార్ కాలనీలో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. అక్కడ ఉన్న అభిమానులను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ రావాలని పిలవడంతో వెళ్లారు. దీంతో పోలీసులు ఏం జరిగిందో తెలుసుకుని తిరిగి పంపించేశారు. అనంతరం తెరవెనుక రాజకీయ ప్రమేయంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మళ్లీ వారిని ఆదివారం రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ‘మీపై ఎలాంటి కేసు నమోదు చేయబోం’ అని పిలిపించి రాత్రంతా స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారు. అంతేకాక మొత్తం 11మందిపై కేసులు నమోదు చేసి అందులో ఎనిమిది మందిని సోమవారం ఉదయం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి 13 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. ఈ అక్రమ కేసుల వెనుక మంత్రితోపాటు ఆయన తనయుడి ప్రమేయం ఉందని జగన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
వీరిపైనే కేసులు
పోలీసులు మొత్తం 11మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఏ1గా ప్రకాష్‌నగర్‌కు చెందిన గంగరబోయిన రవి, ఏ2గా యర్రా నాగరాజురెడ్డి దానవాయిగూడెం) పేరు నమోదు చేయగా, ఆతర్వాత వరుసగా మర్రి శ్రీనివాస్(శ్రీనగర్‌కాలనీ), ఆలస్యం సుధాకర్ (ముస్తఫానగర్), సరికొండ రామరాజు (పాండురంగాపురం), గంగారపు మురళి(రావినూతల), పగిళ్ల నరేష్(వైఎస్సార్ కాలనీ), కంచి మితేష్(రామాపురం), ముడి శివారెడ్డి(కోదాడ), కంచర్ల సాయి(గాంధీచౌక్), వెంకీ పేర్లు చేర్చారు. వీరిలో ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించారు.
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం ఉదయం కేక్ కట్ చేశాక భారీ ర్యాలీతో అభిమానులు సందడి చేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి మొదలైన ర్యాలీ ఇల్లెందు క్రాస్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రోడ్, జెడ్పీ సెంటర్, ముస్తఫానగర్, చర్చి కాంపౌండ్, కాల్వొడ్డు, రాపర్తినగర్, కేఎంసీ కార్యాలయం రోడ్, గట్టయ్య సెంటర్ మీదుగా ఎన్‌టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, వైఎస్సార్ నగర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు.
జగన్ అభిమానులు 11మందిపై క్రిమినల్ కేసులు
వైఎస్ అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీ టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడ ఉన్న వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కానీ కార్యాలయం లోపలికి వెళ్లి వాచ్‌మన్‌ను దూషించారని, ఆఫీస్‌ను ధ్వంసం చేశారని చెప్పడం అవాస్తవం. టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి.. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న నేత తప్పుడు కేసులు పెట్టించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– లక్కినేని సుధీర్,
వైఎస్సార్‌సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు
పోలీసుల అత్యుత్సాహం


