విపత్తులను ఎదుర్కొనేలా..
● మున్నేటి ఒడ్డున మాక్‌డ్రిల్ ● పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు బాధితులను రక్షించడంతో పాటు విపత్తులను ఎదుర్కోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు(బొక్కలగడ్డ) వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్నేటికి గత రెండేళ్ల నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యాన ప్రజలు తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆస్తులు నష్టపోకుండా కాపాడుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, జూన్ 2026 లోపు మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రి వద్ద కూడా మాక్‌డ్రిల్ చేపట్టామని వెల్లడించారు.
రెస్క్యూ చేస్తూ..
వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లను పంపించి రక్షించడంపై ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. అలాగే, నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీశాక వైద్య సాయం అందించడం, ఇళ్లు మునిగితే ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించే విధానాన్ని వివరించారు. అలాగే, మాక్‌డ్రిల్‌లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడకు తరలించిన వారికి వైద్యసేవలు అందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, విద్యుత్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈలు శ్రీనివాసాచారి, రంజిత్, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఏదులాపురం కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు అనిల్‌కుమార్, రాంప్రసాద్, ధరణికుమార్, శ్రీనివాస్, బెల్లం రాధిక, సుజాత, మాధవరావు, దివ్యశ్రీ, రాజేశ్వరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విపత్తులను ఎదుర్కొనేలా..
విపత్తులను ఎదుర్కొనేలా..


