పత్తి అమ్మి వస్తుండగా ప్రమాదం
●కారేపల్లి వాసి మృతి
మహబూబాబాద్ రూరల్/కారేపల్లి: ఓ రైతు పత్తి విక్రయించి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దెవారిగూడెంకు చెందిన కడారి ఉపేందర్(55) ఈనెల 18న వరంగల్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ పత్తి విక్రయించాక నర్సంపేట మీదుగా బొలెరోలో స్వగ్రామానికి బయలుదేరాడు. జమాండ్లపల్లి శివారులో టిప్పర్ డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనకకు రావడంతో బొలెరో నడుపుతున్న నరేశ్ అదుపు చేసేలోగా టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో బొలెరో బోల్తా పడగా ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నరేశ్‌కు గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు ఉండగా భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని శనివారం గిద్దెవారిగూడెం తీసుకురాగా, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ నివాళులర్పించారు. నాయకులు దేవ్లానాయక్, పగడాల మంజుల, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, ఈసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఖమ్మం గట్టయ్యసెంటర్‌కు చెందిన చెరుకుపల్లి నాగేశ్వరరావు (40) ఈనెల 19న బైపాస్‌రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి అజాగ్రత్తగా వచ్చిన లారీడ్రైవర్ ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఘటనపై ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కల్లూరురూరల్: మండలంలోని చండ్రుపట్లలో వీధి కుక్కలు దాడిచేయగా 14 గొర్రెలుమృతిచెందాయి. మరో ఆరుగొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చండ్రుపట్లకు చెందిన జోనబోయిన కృష్ణ శుక్రవారం సాయంత్రం తన గొర్రెల మందను దొడ్డిలో జాగ్రత్త చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సమయాన ఫెన్సింగ్‌ను దాటి దొడ్డి లోకి చొరబడిన కుక్కలు దాడి చేయడంతో 14 గొర్రెలు చనిపోయాయి. ఈ సమయాన ఒక గొర్రె తప్పించుకెళ్లి అరుస్తుండగా స్థానికులు లేచి కుక్కలను తరిమివేశా రు. కల్లూరు వెటర్నరీ డాక్టర్ మమత, ఉద్యోగి ఆమని శనివారం ఉదయం పంచనామా నిర్వహించారు.
నాచారం–జూలూరుపాడు రోడ్డుకు రూ.43 కోట్లు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా ఏన్కూరు, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే రహదారి విస్తరణకు ప్రభుత్వం రూ.43 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటి గుడిసె మీదుగా నాచారం–జూలూరుపాడు మార్గంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
పాన్‌షాప్‌లో షార్ట్ సర్క్యూట్
ఖమ్మంక్రైం: ఖమ్మం పాతబస్టాండ్‌లోని ఓ పాన్ దుకాణంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. షాప్ యజమాని తాళం వేసి వెళ్లాక పొగలు వస్తుండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.
పోలీసుస్టేషన్‌కు వెళ్తూ
ఆత్మహత్యాయత్నం
రఘునాథపాలెం: మండలంలోని కోటపాడుకు చెందిన కె.కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్యను చంపుతానని ఆయన బెదిరించినట్లు బాధితుడి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ క్రమంలో విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని సమాచారం ఇవ్వగా మార్గమధ్యలో కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య
ఖమ్మంక్రైం: మానసిక ఆందోళనతో ఓ బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్న శివకోటి భార్గవి (26) కామారెడ్డిలోని బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తోంది. మానసిక ఆందోళనకు గురవుతున్న ఆమె ఖమ్మంవచ్చి ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకుంది. భార్గవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.


