కీలకంగా ఖమ్మం–దేవరపల్లి హైవే
● త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసే కీలకమైనదిగా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ధంసలాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఆర్వోబీ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పరిశీలించారు. మున్నేటిపై వంతెన, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిపై ఆరాతీసిన ఆయన త్వరగా పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
●ఖమ్మం 16వ డివిజన్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులు నిలిచిపోవడానికి కారణాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్న ఆయన నివేదికను హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌కు పంపించాలని ఆదేశించారు. ఆపై నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
●భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే, ఆలయ నూతన క్యాలెండర్‌ను అందించగా.. ముక్కోటి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్న మంత్రి భక్తులకు ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షించాలని సూచించారు.


