పది రోజుల్లో అక్రిడిటేషన్లు
ఖమ్మంసహకారనగర్: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పది రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభలు శనివారం ఖమ్మంలో జరగగా, సభకు హాజరుకావాల్సిన మంత్రి అత్యవసర సమావేశం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించిన మంత్రి.. అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యాన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ విషయమై తీపి కబురు అందిస్తామన్నారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మంత్రి పొంగులేటి క్యాంపు ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, తుమ్మల యుగంధర్, కూరపాటి ప్రదీప్, యలమంచిలి రవీంద్రనాథ్ మాట్లాడారు. ఈ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, కార్యదర్శి ఈ.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, కొత్తా యాకేశ్, నూకల రామచంద్రమూర్తి, జానీపాషా, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీని ఈ మహాసభల్లో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఖదీర్, శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా తేనె వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్‌గా దువ్వా సాగర్, సహాయ కార్యదర్శులుగా జక్కంపూడి కృష్ణ, కూరాకుల గోపి, నాగుల్‌మీరా ఎన్నికయ్యారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


