రండి.. దయచేయండి.. | - | Sakshi
Sakshi News home page

రండి.. దయచేయండి..

Dec 20 2025 7:38 AM | Updated on Dec 20 2025 7:38 AM

రండి.

రండి.. దయచేయండి..

ఖమ్మం రీజియన్‌లో బస్సులు

ఆర్టీసీలో ఆత్మీయ పలకరింపులు

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

ప్రయాణికులను ఆకర్షిస్తున్న వైనం

సత్తుపల్లిటౌన్‌/చుంచుపల్లి: ‘నా పేరు మాధవి. నేను సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. మనందరం సత్తుపల్లి నుంచి ఖమ్మంకు ఈ బస్సులో ప్రయాణిస్తున్నాం. ఇక్కడి నుంచి దాదాపు రెండు గంటలు ప్రయాణం ఉంటుంది. మీ అందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ హ్యాపీ జర్నీ’ అంటూ తమను తాము పరిచయం చేసుకుంటూ ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు ఆప్యాయంగా స్వాగతిస్తున్నారు.

రూట్‌ వివరాలు సహా..

ఇది కేవలం ఒక్క బస్సులోనే కాదు, పల్లెవెలుగు మొ దలు ఏసీ బస్సుల వరకు, ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ఆత్మీయ స్వాగతాలు, పలకరింపులు అమల్లోకి తెస్తున్నారు. టీజీఎస్‌ ఆర్టీసీ వినూత్న స్వాగత కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. ప్రయాణికులను సిబ్బంది ఆత్మీయంగా పలకరిస్తూ బస్సులోకి ఆహ్వానిస్తున్నారు. సాధారణంగా విమానాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. విమానం బయలుదేరే ముందు ఆ విమానం ఎక్కడికి వెళ్తుంది.. ఎంత సమయం పడుతుంది.. ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల ను ఎయిర్‌ హోస్టెస్‌ వివరిస్తారు. అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ప్రయాణికులకు తమను తాము పరిచయం చేసుకుంటూ, బస్సు వెళ్లే రూట్‌ వివరాలు అన్ని తెలుపుతున్నారు.

ఆదరణ పొందేలా..

ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణ, మన్ననలు పొందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. సంస్థ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రయాణికులకు స్వాగతం పలికే కార్యక్రమం చేపట్టారు. తమతో పాటు సంస్థను పరిచయం చేయటం గమ్యస్థానాలకు చేర్చేందుకు పట్టే సమయం, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి వివరిస్తున్నారు.

అవగాహన కల్పిస్తూ..

ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల్లో అన్ని రకాలు కలిపి 501 బస్సులు ఉన్నాయి. రీజియన్‌లో 852 మంది కండక్టర్లు, 848 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలతో ఏపీకి కూడా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీలో ప్రయాణికులకు స్వాగతం పలకడం, తమతో పాటు సంస్థను పరిచయం చేయడం, గమ్యస్థానం చేరేందుకు ఎంత సమయం పడుతుంది, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను సిబ్బంది వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లోనూ ఈ విధానం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. బస్సులో ప్రయాణించే వారికి స్వాగతం పలకడమే కాకుండా ఇతరత్రా అంశాల పైనా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు, ఆపత్కాలంలో బస్సులోని ప్రధాన ద్వారమే కాకుండా అత్యవసర ద్వారం అందుబాటులో ఉంటుందని, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలనే విషయాలనూ తెలియజేస్తున్నారు. ఏసీ బస్సుల్లో అద్దాలను పగలగొట్టేందుకు వీలుగా అక్కడక్కడా హ్యామర్లు (సుత్తి) ఉంచుతున్నారు. వాటి వినియోగం తీరును ప్రయాణికులకు తెలుపుతున్నారు. సేవల్లో లోపాలు ఉన్నా, సంస్థ ఉన్నతికి తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుపుతూ ఎంత సమయం పడుతుందో ప్రయాణికులకు వివరిస్తూ ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది కోరడం ఆకట్టుకుంటోంది.

లహరి ఏసీ/నాన్‌ఏసీ 10

రాజధాని ఏసీ బస్సులు 35

సూపర్‌లగ్జరీ బస్సులు 91

డీలక్స్‌ 40

ఎక్స్‌ప్రెస్‌లు 82

పల్లెవెలుగు 21

అద్దె బస్సులు 222

రీజియన్‌లో కండక్టర్లు 852 మంది

డ్రైవర్లు 848 మంది

రండి.. దయచేయండి.. 1
1/1

రండి.. దయచేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement