గడువులోగా అభివృద్ధి పనులు
వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా రోప్‌వే
అభివృద్ధి పనులపై సమీక్షలో
మంత్రి తుమ్మల
ఖమ్మం సహకారనగర్: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఉద్యోగులను అభినందించారు. కాగా, పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని, ‘నరేగా’ ద్వారా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో సాగర్ జలాలు రాకున్నా పంటలకు సాగునీరు అందంచేలా సీతారామ ఎత్తిపోతల పథకం అనుమతులు సాధించాలని, సత్తుపల్లి ట్రంకు, పంప్ హౌస్, పాలేరు టన్నెల్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ఖిల్లాపైకి రోప్‌వే, యంగ్ ఇండియా సమీకత గురుకులాల నిర్మాణాలు, మెడికల్ కాలేజీ భవనం, మంచుకొండ ఎత్తిపోతల పథకంపై సమీక్షించారు. రోప్‌వే వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఖమ్మం అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం పాకబండ సమీపాన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశా క మాట్లాడారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.


