ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
కారేపల్లి: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ సింగరేణి మండల ఆర్‌ఐ ఏసీబీకి పట్టుబడింది. ఏసీబీ డీఎస్‌పీ వై.రమేష్ తెలిపిన వివరాలు... ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జీపీఓ పరిశీలన పూర్తయ్యాక ఆ దరఖాస్తు ఆర్‌ఐ లాగిల్‌కు వెళ్లింది. అనంతరం ఆర్‌ఐ విచారించి పై అధికారికి నివేదించాల్సి ఉంది. ఈక్రమంలో సింగరేణి తహసీల్‌లోని ఆర్‌ఐ–2 దౌలూరి శుభకామేశ్వరీదేవి రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. ఈనెల 17వ తేదీ వరకు ఇల్లెందు లలితాపురం వద్ద చెక్‌పోస్టులో ఎన్నికల తనిఖీ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆమె తీరుపై దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారుల సూచనలతో గురువారం రూ.10వేలు తీసుకొని తహసీల్‌కు వెళ్లగా కారేపల్లి ప్రభుత్వ సమీపాన తాను ఉండే ఇంటికి రావాలని ఆమె ఫోన్‌లో సూచించింది. దీంతో పిర్యాదుదారుడు అక్కడ రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు శుభకామేశ్వరీదేవిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 91543 88981 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రమేష్ సూచించారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.10వేలు డిమాండ్


