
చకచకా పామాయిల్ ఫ్యాక్టరీ
భారం తగ్గుతుంది..
● ఉమ్మడి జిల్లాలో మూడో ఫ్యాక్టరీ నిర్మాణం ● కల్లూరుగూడెంలో కొనసాగుతున్న పనులు ● రైతులకు తగ్గనున్న దూరాభారం
వేంసూరు: ఉమ్మడి జిల్లాలో మూడో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో 42 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉగాది పండుగ రోజున శంకుస్థాపన చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రూ.40 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. గంటకు 15టన్నుల గెలల క్రషింగ్ చేసే సామర్థ్యం ఉంటుందని, భవిష్యత్‌లో దిగుబడి ఆధారంగా గంటకు 60 టన్నుల మేర క్రషింగ్ చేసేలా సామర్ధ్యం పెంచుకోవచ్చని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన ఆయిల్‌పామ్ సాగు
జిల్లావ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 7,792 మంది రైతులు 28,685.11 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది మరో 10వేల ఎకరాలు పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 4,626 మంది రైతులు 17,221 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఈ మండలంలో రైతులు ఇంకొందరు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట కావడం, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు, కోతుల బెడద లేకపోవడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
రైతులకు మేలు
ప్రస్తుతం అశ్వారావుపేటలో 30 టన్నులు, అప్పారావుపేట లో 60టన్నుల సామర్ధ్యంతో పామాయిల్ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగానే కాక జిల్లాలోనూ ఆయిల్‌పామ్ సాగు పెరగగా ఎక్కువగా ఈ రెండు ఫ్యాక్టరీలకే గెలలు తీసుకొస్తుండడంతో వీటిపై భారం పడుతోంది. అంతేకాక రైతులు వ్యయప్రయాసలకోర్చి ఆయిల్‌పామ్ గెలలను తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతుల ఇక్కట్లు తీరనున్నాయి. అంతేకాక స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
మా గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండడం సంతోషంగా ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఆయిల్‌పామ్ గెలల తరలింపులో రవాణా భారం తగ్గుతుంది. గెలలను సులువుగా తరలించవచ్చు. స్థానికులకు ఉపాధి సైతం పెరుగుతుంది. – బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు,
కల్లూరుగూడెం

చకచకా పామాయిల్ ఫ్యాక్టరీ

చకచకా పామాయిల్ ఫ్యాక్టరీ