
కూపన్ల ఆధారంగా యూరియా
యూరియా కోసం
రోడ్డెక్కిన రైతులు
● పాస్‌పుస్తకం పరిశీలించాకే జారీ ● క్యూలైన్లను తగ్గించేలా అమలుకు అధికారుల నిర్ణయం
ఖమ్మంవ్యవసాయం: కూపన్ల ద్వారా యూరియా పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సరిపడా యూరియా అందుబాటులో లేక రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సంఘాలకు వచ్చే యూరియా కొద్దిగా ఉండడం, రైతులు ఎక్కువ కావడంతో చాలా మంది ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఈనేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో యూరియా పంపిణీ కేంద్రాలు, పీఏసీఎస్‌ల వద్ద రైతులు వేచి ఉండకుండా టోకెన్ల(కూపన్లు) జారీ చేయాలని ఆదేశించారు. స్టాక్ ఆధారంగా రైతులకు కూపన్లు ఇచ్చి వారే వచ్చి యూరియా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పాస్‌పుస్తకంతో వస్తే...
రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుతో వస్తే ఏఈఓ, పీఏసీఎస్ సీఈఓలు పరిశీలించి భూవిస్తీర్ణం ఆధారంగా యూరియా కూపన్లు జారీ చేస్తారు. ఆ కూపన్ల ఆధారంగా గరిష్టంగా రెండు యూరియా బస్తాలు తీసుకెళ్లే వెసులుబాటు కల్పి స్తారు. అయితే, పంపిణీదారులు పలువురి పేరిట కూపన్లను పక్కదారి పట్టించే అవకాశముందని, పలుకుబడి ఉన్న వారికే ఇచ్చే ప్రమాదముందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో శనివారం వరకు 900 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా, మార్క్‌ఫెడ్ వద్ద 150మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు.
కారేపల్లి: సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ రైతులు కారేపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ఉదయం 5గంటలకే
కారేపల్లి సొసైటీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే, యూరియా స్టాక్ లేదని, 8గంటల వరకు లారీ వస్తే పంపిణీ
చేస్తామని సొసైటీ సిబ్బంది చెప్పారు. అయితే, 8గంటల వరకు ఉన్నా లారీ
రాకపోగా, ఇకపై రాదని సిబ్బంది చెప్పడంతో రైతులు ర్యాలీగా వెళ్లి కుమురంభీం
సెంటర్‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పనులు వదిలేసి ఉదయాన్నే వస్తే యూరియా
ఇవ్వకపోవడం సరికాదని మండిపడ్డారు. దీంతో వాహనాలు నిలిచిపోగా ఎస్‌ఐ బి.గోపి, ఏఓ భట్టు అశోక్ సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.