
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఖమ్మంక్రైం: వినాయక నవరాత్రోత్సవాలు, నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ఈనెల 27న వినాయక నవరాత్రులు మొదలుకానుండగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో శనివారం జరిగి న శాంతి కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీల సభ్యుల సమావేశంలో సీపీ మాట్లాడారు. అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను గతంలో మాదిరిగానే ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇందుకోసం పోలీసులు తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు సహకరించాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రైవేట్ స్థలాలైతే యజమానుల నుంచి అభ్యంతరం లేదనే పత్రం తీసుకోవాలని సీపీ చెప్పారు. అలాగే, మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కాగా, మండపాల వద్ద కమిటీ వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాస్, మహేష్, అధికారులు పాల్గొన్నారు.
కమిటీల సమావేశంలో సీపీ సునీల్‌దత్