
సర్వేలతోనే సరి..
మరమ్మతులు తప్పనిసరి
నిధులు కేటాయించాలి..
● వసతిగృహాలు, గురుకులాల్లో పరిష్కారం కాని సమస్యలు ● నిధులు లేక మరమ్మతుకు నోచుకోని భవనాలు ● గిరిజన శాఖలో మెస్ బిల్లులు రాక ఏడు నెలలు ● మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న యంత్రాంగం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరి ష్కారం కావడం లేదు. అధికారులు సర్వేల పేరుతో కాలం గడుపుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్య వహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత నెల 29, 30వ తేదీల్లో జిల్లాలోని అనేక సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలను అధికారులు సందర్శించా రు. అక్కడి సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. అయినా ఇప్పటికీ వీటిని పరిష్కరించకపోగా వసతిగృహాల సంక్షేమ అధికారులకు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ మరోసారి సర్వేకు సిద్ధమవుతుండడంతో పరిష్కారం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అన్నీ సమస్యలే..
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలను ఏర్పాటు చేసింది. కానీ, నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, తాగునీటి సౌకర్యాలు లేకపోవడం, గదులు ఇరుకుగా ఉండడం తదితర సమస్యలు వేధిస్తున్నాయి.
దాటవేత ధోరణి
గత నెలలో అధికారులు వసతి గృహాలను, గురుకులాలను పరిశీలించగా గుర్తించిన సమస్యలపై జిల్లా అధికారులకు నివేదికలు అందజేశారు. చాలా వసతిగృహాలకు డోర్లు, మెష్ డోర్లు, కిటికీలకు తలుపులు, బాత్‌రూమ్‌లు సరిగ్గా లేకపోవడం, తాగునీరు అందకపోవడాన్ని గుర్తించారు. వీటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, మరోమారు ఈ నెల 21, 22వ తేదీల్లో సర్వే చేయించడం గమనార్హం. గతంలో గుర్తించిన సమస్యలను పక్కనపెట్టి మరోమారు సర్వేతో ప్రయోజనం ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపాదనలు బుట్టదాఖలే..
జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో మరమ్మతుల కోసం రూ.20.10 లక్షలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లోనూ సమస్యలు వేధిస్తున్నాయి. మధిరలోని ఎస్‌టీహెచ్ (షెడ్యూల్డ్ ట్రైబ్ హాస్టల్), ముదిగొండ మండలం వల్లభిలోని ఆశ్రమ పాఠశాల, తిమ్మారావుపేట ఎస్‌టీహెచ్, ఖమ్మం, ఖమ్మంరూరల్ పోస్ట్‌మెట్రిక్ కాలేజీల్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఎస్సీ వసతి గృహాల్లో కూడా వసతులు సక్రమంగా లేవు. జిల్లాలోని 52 వసతిగృహాల్లో మరమ్మతులకు రూ.2,42,11,000 అవసరమని ప్రతిపాదిస్తే ఇవన్నీ బుట్టదాఖలయ్యాయే తప్ప ఒక్క రూపాయి మంజూరు కాలేదు.
బిల్లులు అందక ఏడు నెలలు..
వసతిగృహాల మరమ్మతులకు నిధులు లేక కునారిల్లుతుంటే.. మరోపక్క విద్యార్థుల మెస్ బిల్లులు కూడా రావడం లేదని తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన వసతిగృహాలకు ఫిబ్రవరి నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దీంతో విద్యార్థులకు భోజనం అందించడంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. మెస్ బిల్లులు రాక.. వసతిగృహాల మరమ్మతులకు నిధులు రాక వసతిగృహాల సంక్షేమ అధికారులు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహా లు, గురుకులాల్లో అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలి. చాలా భవనాలు శిథిలా వస్థకు చేరాయి. అధికారుల సర్వేల్లో లోపాలను గుర్తించి నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికై నా నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలి. –టి.ప్రవీణ్, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ
సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. మర మ్మతులు చేపట్టక భవనాలు శిథిలమయ్యాయి. ఇకనైనా ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు పూర్తి చేయించాలి. కొన్నిచోట్ల టాయిలెట్లు బాగా లేవని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు.
–వి.వెంకటేశ్, జిల్లా కార్యదర్శి, పీడీఎస్‌యూ

సర్వేలతోనే సరి..

సర్వేలతోనే సరి..

సర్వేలతోనే సరి..