
పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్తపంథా
● ‘కాపాస్ కిసాన్’ పేరిట ప్రత్యేక యాప్ ● యాప్‌లో రిజిస్ట్రేషన్‌తో సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర
ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈసారి నూతన విధానం అమలుచేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందించేలా సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో రైతులు రిజిస్ట్రేషన్ చేయించకుంటేనే సీసీఐ కేంద్రాల్లో పంట విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. ఈనెల 30 నుంచి గుగూల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ స్టోర్‌లో యాప్ అందుబాటులోకి రానుంది. ఈమేరకు రైతులు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని భూమి పత్రాలు, పత్తి సాగు చేసినట్లు రెవెన్యూ శాఖ ధ్రువీకరణ, ఆధార్ కార్డులతో సెప్టెంబర్ 1నుంచి 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పారదర్శకత, మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం పత్తికి నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కేలా సీసీఐ నూతన విధానం అమలుకు చర్యలు చేపట్టింది. గతంలో అనుసరించిన విధానంలో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర ఎక్కువగా దళారులే దక్కించుకున్నారనే విమర్శలు వచ్చాయి. రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి బినామీల పేరిట పత్రాలతో సీసీఐ కేంద్రాల్లో అమ్ముతూ మద్దతు ధర పొందారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యాన నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా క్వింటా పత్తికి నాణ్యత ఆధారంగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర గరిష్టంగా రూ. 8,110 రైతులకే దక్కేలా ‘కాపాస్ కిసాన్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.