
ఇనుప గేట్ల చోరీ నిందితుల అరెస్టు
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా సమీపాన ఈ నెల 7న వ్యవసాయక్షేత్రంలో ఇనుప గేట్లను చోరీ చేసిన ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం వికలాంగుల కాలనీకి చెందిన ధనగుల కోటేశ్వరరావు, ఆయన భార్య రేణుక, బంధువు సుజాత కలిసి టాటా ఏస్ వాహనంలో గేట్లను తీసుకెళ్తూ ఎదుళ్లచెరువు సమీపాన పొదల్లో దాచారు. శుక్రవారం వీటిని వాహనంలో తరలిస్తుండగా పిండిప్రోలు వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
సెంట్రింగ్ షీట్ల చోరీ కేసులో ముగ్గురు..
ఖమ్మంఅర్బన్: సెంట్రింగ్ షీట్ల చోరీ కేసులో ముగ్గురిని ఖానాపురం హవేలీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం రోడ్డులో గురువారం తనిఖీ చేస్తుండగా వాహనంలో భవన నిర్మాణ పనులకు వినియోగించే రూ.40 వేల విలువైన 30 సెంట్రింగ్ షీట్లు లభించాయి. అందులో ఉన్న చింతకాని మండలానికి చెందిన అరవింద్, ఎస్.వీరబాబు జి.గోపిని విచారించగా చోరీని అంగీకరించారు. గతంలోనూ వీరిపై చోరీ కేసులు ఉన్నందున కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ ట్రక్కుల దొంగ..
చింతకాని: చింతకాని, కొణిజర్ల మండలాల్లో ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేసిన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామా నికి చెందిన చింతల నరేంద్రను చింతకాని పోలీసు లు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నాగుల్‌మీరా కథనం మేరకు.. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్‌ను తన స్నేహితుడైన చింతకాని మండలం ప్రొద్దుటూరు వాసి పాసంగులపాటి విష్ణువర్ధన్‌కు ఇచ్చా డు. అక్కడ ఈ నెల 15న ట్రక్కు చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మత్కేపల్లి క్రాస్ వద్ద గురువారం చేపట్టిన తనిఖీల్లో బోనకల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను చూసి వెనక్కి తిప్పుకునే క్రమంలో అడ్డుకోగా, చింతల నరేంద్ర, ఆయన స్నేహితుడు మువ్వల ఉదయ్ కిరణ్‌తో కలిసి ప్రొద్దుటూరులో రెండు, కొణిజర్ల మండలం పెద్దమునగాలలో ట్రక్కును చోరీ చేసినట్లు అంగీకరించాడు. రూ.4.60 లక్షల విలువైన ట్రక్కులు స్వాధీనం చేసుకుని నరేంద్రను అరెస్ట్ చేశామని, ఉదయ్ పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ–2 సారయ్య, ఏఎస్సైలు సువర్ణబాబు, లక్ష్మణ్‌చౌదరి పాల్గొన్నారు.
కృత్రిమ మేథకు
బానిసలుగా మారొద్దు
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు
ఖమ్మం సహకారనగర్: విద్యాభివృద్ధి, సమాజాభివృద్ధిలో కీలకంగా నిలవాల్సిన విద్యార్థులు కృత్రిమ మేధకు బానిసలుగా మారొద్దని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు. ఖమ్మంలోని ఎస్‌టీఐటీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. కృత్రిమ మేధను అవసరానికి విని యోగించుకోవాలే తప్ప పూర్తిగా ఆధారపడొద్దని తెలిపారు. అలాగే, మంచి అలవాట్లు, నిరంతరం అభ్యాసంతో ఫలితాలు సాధించాలని చెప్పారు. అనంతరం కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ జి.ధాత్రి మాట్లాడగా అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, గంధం శ్రీని వాసరావు, శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
‘భగీరథ’ సిబ్బంది
విధుల బహిష్కరణ
నేలకొండపల్లి/వైరా: మూడు నెలలుగా వేతనాలు అందనందున శుక్రవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు మిషన్ భగీరథ కార్మికులు ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాలో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, వాల్ ఆపరేటర్లు, హెల్పర్లు కలిపి 463 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడు నెలలుగా రూ.3 కోట్ల మేర వేతనం బకాయి ఉంది. ఈ విషయమై 12న అధికారులతో జేఏసీ నాయకులు చర్చిస్తే 21లోగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేక శుక్రవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరణకు తీర్మానించారు. దీంతో శనివారం నుంచి జిల్లాలో తాగునీటి సరఫరాలతో సమస్య ఎదురవుతాయని భావిస్తున్నారు. కాగా, విధుల బహిష్కరణ విషయాన్ని జేఏసీ నాయకుడు మద్దెల రవి వెల్లడించారు.