
బియ్యం పంపిణీకి సిద్ధం
ఈసారి కొత్త కార్డుదారులకూ కోటా జిల్లాలో 21,925 కొత్తకార్డులకు బియ్యం కేటాయింపు
నెల నెలా పంపిణీ
ఖమ్మం సహకారనగర్: రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వచ్చే నెల నుంచి యథావిధిగా మొదలుకానుంది. వర్షాలు, వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదురుకాకుండా జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్ నెలలోనే పంపిణీ చేసిన విషయం విదితమే. ఇక సెప్టెంబర్ కోటాను అదే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
దుకాణాలకు సరఫరా
జిల్లాలో వచ్చేనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ మొదలుకానుంది. దీంతో ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 748 రేషన్ షాప్‌లు ఉండగా.. ఇప్పటి వరకు 150దుకాణాల వరకు బియ్యం చేరవేశామని అధికారులు తెలిపారు.
కొత్తగా 41,615 రేషన్‌కార్డులు
ప్రజాపాలన సభల్లో స్వీకరించిన దరఖాస్తులకు తోడు మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులకు కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారు. ఇదేసమయాన కార్డుల్లో కొత్త పేర్లు సైతం నమోదు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 41,615 కార్డులు జారీ చేయగా, 1,42,601 లబ్ధిదారులకు లబ్ధి జరిగింది. మే నెల వరకు కార్డులు అందిన వారికి మూడు నెలల బియ్యాన్ని జూన్‌లో సరఫరా చేశారు. ఇక జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 21,925 కొత్తకార్డులు మంజూరు చేయగా, వీరికి వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తారు.
మూడు నెలల తర్వాత వచ్చే నెల సరఫరా
రేషన్‌కార్డు లబ్ధిదారులకు సెప్టెంబర్ నుంచి యథావిధిగానే నెలనెలా బియ్యం పంపిణీ చేస్తాం. ఇప్పటికే సెప్టెంబర్ కోటా బియ్యాన్ని రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నాం. 1వ తేదీ నుంచి గతంలో మాదిరిగానే పంపిణీ మొదలవుతుంది.
– చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

బియ్యం పంపిణీకి సిద్ధం