
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా: వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేతెత్తుతున్నారు. ఇంట్లో ఉన్న పసిపాపలపై కూడా దాడికి ఎగబడుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎక్కడైనా చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తే తప్ప అధికారుల్లో చలనం రావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కులు ఓ చిన్నారిని గాయపరిచాయి.
వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సౌందపు ఈశన్విక్.. ఏడాది వయస్సు ఉన్న బాబును వీధిలోకి వచ్చిన ఓ పిచ్చికుక్క విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాబును ఇంటి వరండాలో ఉంచి తల్లి ఇంటి పని చేసుకుంటుండగా పిచ్చి కుక్క వచ్చి దాడి చేసినట్లు తండ్రి సంతోష్ తల్లి వెన్నెల తెలిపారు. బాబును హుటాహుటిన మణుగూరు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.