
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని బలవన్మరణం
ఖమ్మం జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒంటరిగా వదిలేయడాన్ని తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రమ్య(20) వైజాగ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలు సోమవారం గ్రామంలో నిర్వహించగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొర్లపుడి బాసు కుమార్తె రమ్య(20), ఇదే గ్రామానికి చెందిన మేడ చిన్న బొందయ్య కుమారుడు నరేష్ ప్రేమించుకున్నారు. కులాలు వేర్వేరు కావడంతో కుటుంబాల్లో గొడవలు జరిగాయి. ఆపై రమ్య చదువు మానేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోం చేస్తుండగా నరేష్ ఏడాది క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా రమ్యతో ప్రేమ కొనసాగిస్తూ 15 రోజుల క్రితం ఆమెను వైజాగ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
ఇంతలోనే తన కొడుకు కానరావడం లేదని నరేష్ తండ్రి చిన్న బొందయ్య ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ రమ్యను వదిలించుకోవాలని ఆమె వద్ద నగదు, నగలు, సెల్‌ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. దీంతో మోసపోయానని గమనించిన రమ్య వైజాగ్‌లోని అద్దె ఇంట్లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
‘నన్ను క్షమించండి.. నా చావుకు కారణం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి వెళ్లిపోయిన వాడి పేరు నరేష్. నా తల్లిదండ్రులకి, ఇక్కడి వాళ్లకు నా చావుకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న సారీ.. నాన్న వాడిని మాత్రం అసలు వదిలిపెట్టకు. తమ్ముడు జాగ్రత్త. నా కోసం ఆలోచించకండి. లవ్‌యూ నాన్న. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించావు. నీ లాంటి తండ్రి ఏ కూతురికి ఉండడు’ అంటూ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న వైజాగ్ టూటౌన్ పోలీసులు పోస్టుమార్టం చేసి రమ్య మృతదేహాన్ని ఎర్రగడ్డకు పంపించారు. ఈమేరకు నరేష్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆమె కుటుంబీకులు ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై తిరుమలాయపాలెం ఎస్‌ఐ జగదీష్‌తో పాటు కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి పోలీసులతో రమ్య అంత్యక్రియలు పూర్తయ్యే వరకు బందోబస్తు నిర్వహించారు. కాగా, నిందితుడు నరేష్‌ను వైజాగ్ పోలీసులకు అప్పగించారు.