
ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నియామకం ఎప్పుడు?
● కార్యదర్శి లేకుండానే ఎంపిక పోటీలు ● జిల్లా వ్యాయాయ ఉపాధ్యాయుల్లో ఆందోళన
ఖమ్మ స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి నియామకంలో విద్యాశాఖ అధికారులు చేస్తున్న జాప్యం విమర్శలకు తావిస్తోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిని ఎందుకు నియమించడం లేదో స్పష్టత ఇవ్వకపోగా.. ఎడతెగని జాప్యం చేస్తుండడంపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రీడా పోటీలు క్యాలెండర్ ఖరారైనా పట్టించుకోకపోగా.. కార్యదర్శి లేకుండానే జిల్లాస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించడం గమనార్హం. ఈ విషయమై కొందరికి మాత్రమే సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆశించిన స్థాయిలో వాలీబాల్ క్రీడాకారులు హాజరుకాలేదు.
సమాచారం కరువు
సుబ్రతో ముఖర్జీ కప్ పేరిట ఫుట్‌బాల్ టోర్నీని ఏటా రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ పోటీలు సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశముంది. కానీ జిల్లాలో ఇంత వరకు పోటీలకు సంబంధించి సమాచారం ఎవరికీ ఇవ్వకపోవడంపై అధికారుల తీరును క్రీడాకారులు, కోచ్‌లు తప్పుపడుతున్నారు. ఇలాంటి అన్ని సమస్యలకు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి లేకపోవడమే కారణంగా నిలుస్తున్న నేపథ్యాన అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
పాఠశాలల క్రీడా కార్యదర్శి నియామకంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. జిల్లాలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్‌కే పదవి ఇచ్చే ఆనవాయితీ ఉండగా, ఈసారి జూనియర్లకు ఇస్తారనే ప్రచారంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోన ఇతర జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా నియమించాలే తప్ప కొత్త నిబంధనలు తీసుకురావొద్దని కోరుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్న కార్యదర్శి నియామకాన్ని పట్టించుకోకపోగా, ఇప్పుడు వాలీబాల్ ఎంపిక పోటీల నిర్వహణను జూనియర్లకు అప్పగించడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.