
రెండోరోజూ అవే బారులు
తల్లాడ: తల్లాడ పీఏసీఎస్‌లో రెండో రోజైన మంగళవారం కూడా యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. సొసైటీకీ 911 బస్తాల యూరియా రాగా కూపన్ల ద్వారా ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ట్రెయినీ ఎస్‌ఐ వెంకటేశ్, సీఈఓ నాగబాబు సమక్షాన పంపిణీ చేశారు. అయితే సొసైటీ పరిధిలో భార్యాభర్తల పేరిట భూమి ఉంటే ఇద్దరూ వచ్చి వేలిముద్ర వేయాలనే నిబంధన విధించారు. దీంతో రెండేసి బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. కాగా, భార్యాభార్తలిద్దరూ రావాలనే నిబంధన సడలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. యూరియా పంపిణీని పార్టీ నాయకులు ఆపతి వెంకటరామారావు తదితరులు పరిశీలించి తహసీల్దార్ సురేష్‌కుమార్, ఏడీఏ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు గాదె కృష్ణారావు, కామినేని శ్రీనివాసరావు, పులి వీరయ్య, దావీదు, రామారావు, నరేష్ పాల్గొన్నారు.