
ప్రతిభకు పరీక్ష
సృజనాత్మకతను వెలికితీసేందుకే..
● సైన్స్‌పై ఆసక్తి పెంచేలా ‘వీవీఎం’ ● 6 నుంచి ఇంటర్ విద్యార్థులకు అవకాశం
ఖమ్మంసహకారనగర్: సైన్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెంచడం, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) కార్యక్రమాన్ని రూపొందించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కోసం నిర్వహించే ఈ పరీక్ష దేశంలో అతిపెద్ద సైన్స్ టాలెంట్ సెర్చ్‌గా పేరు సాధించింది. శాసీ్త్రయ దృక్పథం ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం కాగా.. 100 మార్కులకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు.
రిజిస్ట్రేషన్ ఇలా..
వీవీఎం పరీక్షలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30వరకు రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో తరగతి మొదలు ఇంటర్ విద్యార్థులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాసే వెసలుబాటు ఉంది. ఇక అక్టోబర్ 23 లేదా 27వ తేదీల్లో పరీక్ష నిర్వహించి నవంబర్ 15న ఫలితాలు ప్రకటిస్తారు. ఆపై డిసెంబర్ 8, 15, 22తేదీల్లో ఒకరోజు రాష్ట్ర శిబిరం, మే 17, 18వ తేదీల్లో జాతీయ శిబిరం ఉంటుంది.
ఎంపిక పోటీలు
వచ్చేనెల 1 నుంచి మాక్ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవల్–2 పరీక్ష ఆన్‌లైన్‌లో పరిశీలకుల సమక్షాన నవంబర్ 19న నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి పరీక్షలో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. మొత్తంగా 150 మందిని ఎంపిక చేసి, అందులో ప్రతిభ చూపిన ప్రతీ తరగతి నుంచి ముగ్గురు చొప్పున 18మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతీ తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతోపాటు జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేస్తారు. ఇక జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలే కాక మెమెంటో, ప్రశంసాపత్రం ఇస్తారు. ఇదికాక నెలకు రూ.2వేల చొప్పున ఏడాది పాటు ఉపకార వేతనం అందుతుంది. అలాగే ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఉపయోగపడుతుంది. జాతీయస్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపితే ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్ లభిస్తుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది.
– పెసర ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్

ప్రతిభకు పరీక్ష