
జమలాపురానికి దేవుడే దిక్కు
● ట్రస్ట్ బోర్డు లేక అభివృద్ధిపై నీలినీడలు ● దాతలు ముందుకొస్తేనే ఆలయంలో పనులు ● పూర్తిస్థాయి ఈఓ కూడా లేక కొరవడిన పర్యవేక్షణ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా పాలకుల పట్టింపు లేక.. ఏటా రూ.4కోట్ల నికర ఆదాయం ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ముందుడుగు పడడం లేదు. రాష్ట్ర మంత్రులు ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని వెళ్లడమే తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి కూడా కేటాయించకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు దాతలు రూ.కోట్లాది నిధులతో నిర్మాణాలు చేపట్టి ఆలయానికి అప్పగించారు. ఇవి తప్ప ప్రభుత్వపరంగా చొరవ మాత్రం కానరావడం లేదు. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు.
పాలకమండలి ఏర్పాటులో జాప్యం
ఆలయాల అభివృద్ధికి పాలక మండళ్లు(ట్రస్టు బోర్డు) కృషి చేస్తాయి. కానీ దశాబ్దకాలంగా జమలాపురం ఆలయానకి పాలకమండలి లేకపోవడం గమనార్హం. ఈ ఆలయానికి చైర్మన్‌గా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలే వ్యవహరిస్తుండగా.. పాలక మండలి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. అది కూడా జరకపోవడం, గత ఏడాది నుండి మూడుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా నియామకం చేపట్టకపోవడం గమనార్హం. పాలక మండలి ఉంటే ఆలయ అభివృద్ధికి సూచనలు చేయడమే కాక దాతల నుంచి నిధుల సేకరణకు అవకాశం ఉండేది.
ఆరింటిలో ఇదొకటి..
ఆదాయం విషయంలో గణనీయంగా పురోగతి సాధిస్తున్న జమలాపురం ఆలయానికి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. కానీ ఇన్‌చార్జి ఈఓతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్ ఈఓ కొత్తూరి జగన్మోహన్‌రావుకు ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయం, మారెమ్మ ఆలయం, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, మధిరలోని మృత్యుంజయస్వామి వారి ఆలయాల బాధ్యతలు కూడా కట్టబెట్టడంతో జమలాపురం ఆలయ పర్యవేక్షణ కింది స్థాయి ఉద్యోగులే చూసుకోవాల్సి వస్తోంది. వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే ఇన్‌చార్జి ఈఓ వచ్చివెళ్తుండడం.. పాలక మండలి కూడా లేకపోవడంతో ఆలయ అభివృద్ధి విషయంలో పురోగతి కానరావడం లేదు.