
విద్యుత్ వైర్లతో చేపలు వేటాడుతూ మృతి
చింతకాని: విద్యుత్ వైర్ల సాయంతో చేపలు పడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. మండలంలోని అనంతసాగర్‌కు చెందిన డేగల భాస్కర్‌రావు(39) ఊట వాగులో విద్యుత్ వైర్ల సాయంతో మంగళవారం చేపలు పడుతున్నాడు. ఈక్రమాన నీటిలో జారి పడడడంతో చేతిలో ఉన్న విద్యుత్ వైర్లు ఆయనపై పడగా షాక్‌కు గురయ్యాడు. సమీపానే ఉన్న భాస్కర్‌రావు కుటుంబీకులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
చేపల వేటకు వెళ్లి గల్లంతు
మధిర: వరదలతో చేపలు కొట్టుకొస్తుండగా వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన ఘటన మధిర సమీపాన వైరా నదిలో మంగళవారం చోటుచేసుకుంది. మడుపల్లికి చెందిన పెసరమల్లి వినోద్(28) చేపలు పట్టేందుకు వైరా నది వద్దకు వెళ్లాడు. ఈక్రమాన నదిలోకి దిగిన ఆయన ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తుండగా చేపల వేటకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు బుధవారం రానున్నట్లు తెలిసింది.
విచ్చలవిడిగా వ్యవహరిస్తే కేసులు
ఖమ్మంక్రైం: బహిరంగ మద్యపానం, వేగంగా వాహనాలు నడిపే వారితో పాటు నిర్ణీత సమయానికి మించి షాప్‌లు తెరిచినా, నడిరోడ్లపై వేడుకలు నిర్వహించినా సిటీ పోలీస్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని నగర ఏసీపీ రమణమూర్తి హెచ్చరించారు. అలాగే, చోరీ కేసులను త్వరగా చేధించేలా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బృందాల ద్వారా వేగంగా దర్యాప్తు చేసేలా సీసీ కెమెరాల పుటేజీ సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేలా విస్తృత తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈమేరకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఖమ్మం డివిజన్‌లో 38 కేసులు నమోదు చేసి 167మందికి గాను 114 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వీరి నుంచి రూ.11లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
తాలిపేరుకు కొనసాగుతున్న వరద
చర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 21,387 క్యూసెక్కుల చొప్పున వరదనీరు రాగా, 10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లకు గాను ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న దృష్ట్యా 71.84 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నామని ఇంజనీర్లు వెల్లడించారు.