
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలి
● సింగరేణి సీఎండీ బలరామ్ ఆదేశం ● సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు, నేతలతో సమావేశం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో పని చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలని సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. సీఎంపీఎఫ్ రీజియన్ కమిషనర్‌గా ఇటీవల నియమితులైన వంశీధర్ కుసుంభ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులు గతంలో ఏమైనా రుణాలు తీసుకుని ఉంటే నెల రోజుల ముందుగానే వాటిని క్లియర్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ పుస్తకాలు అప్‌డేట్ చేయాలని, వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. అంతకుముందు సంస్థ ప్రధాన కార్యాలయంలో బలరామ్ అధ్యక్షతన సీపీఆర్‌ఎంఎస్ ట్రస్ట్ బోర్డ్ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన నాలుగు ట్రస్టీలకు సంబంధించిన పోస్ట్ రిటైర్మెంట్ కాంట్రిబ్యుటరీ మెడికల్ స్కీమ్ – నాన్ ఎగ్జిక్యూటివ్ (సీపీఆర్‌ఎంఎస్– ఎన్‌ఈ )లకు సంబందించిన అంశాలపై చర్చించారు. అలాగే. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మారిన ట్రస్ట్ సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసమావేశంలో డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వీ.సూర్యనారాయణరావు, డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.