
కూలిన స్తంభం.. తప్పిన ప్రమాదం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనంటున్న గ్రామస్తులు
తిరుమలాయపాలెం: విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోయింది. అప్పటివరకు అక్కడే ఆడుకున్న చిన్నారులు వర్షం వస్తుండగా ఇళ్లలోకి వెళ్లాక స్తంభం కూలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటన మండలంలోని హైదర్‌సాయిపేట శివారు రావిచెట్టుతండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు తొలగింపునకు ఆయా గ్రామాల్లో విద్యుత్ కాంట్రాక్టర్‌తో స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం రావిచెట్టుతండాలో విద్యుత్ స్తంభం వేశారు. ఆ సమయంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర లోతున గుంత తవ్వాల్సి ఉండగా బండ రావడంతో రెండడుగులు మాత్రమే తవ్వి స్తంభం వేశారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా రెండడుగుల గుంతలో తొమ్మిఇ మీటర్ల ఎత్తుగల స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం వర్షానికి స్తంభం కూలగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
కొణిజర్ల: మొక్కల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టిన సంఘటన మండల పరిధిలోని పల్లిపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి ఏపీలోని రాజమండ్రికి మొక్కలు లోడుతో వెళ్తున్న లారీ పల్లిపాడు పెట్రోల్ బంక్ సమీపాన అదుపు తప్పి రోడ్డు మీద బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనాలేవి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పగా.. ఎవరూ గాయపడలేదు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

కూలిన స్తంభం.. తప్పిన ప్రమాదం