
మళ్లీ దొంగలు పడ్డారు..
● సింగరేణి క్వార్టర్లలో చోరీ ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. ● విచారణ చేస్తున్న క్లూస్ టీం
సత్తుపల్లి: సింగరేణి క్వార్టర్స్‌లో మళ్లీ దొంగలు పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న భారీ చోరీ సంఘటన మరవక ముందే.. శనివారం రాత్రి 2.30 గంటల సమయాన మళ్లీ చోరీ జరగడం సంచలనమైంది. రాఖీ పండగ, వరుస సెలవులు రావడంతో సింగరేణి కార్మికులు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇకపోతే సింగరేణి క్వార్టర్స్‌లో తలుపులు బలహీనంగా.. అల్యూమినియం గడియలు ఉండడంతో దొంగలకు గడియలు పగలకొట్టడం తేలికై నట్టుగా ఉంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి మరీ చోరీకి పాల్పడ్డారు. అశోక్ ఇంట్లో రెండు తులాల బంగారం, 57 తులాల వెండి, రూ.20వేల నగదు, అఖిల్ ఇంట్లో 16 కాసుల బంగారం, ఎందీ సాధిక్ ఇంట్లో రూ.2 లక్షల నగదు, 40 గ్రాముల వెండి, కె.సుధాకర్ ఇంట్లో రూ.30వేల నగదు, నసీమ్‌ఖాన్ ఇంట్లో రూ.20వేల నగదు, శీలం రాజు ఇంట్లో రూ.16వేల నగదు చోరీకి గురయ్యాయి. ఏప్రిల్ నెలలో 8 క్వార్టర్స్‌లో జరిగిన చోరీ ఘటనలో రూ.80 లక్షలకుపైగా బంగారం, నగదు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి క్లూ చిక్కలేదు. సింగరేణి కార్మికుల ఇళ్లనే టార్గెట్‌గా నాలుగేళ్లలో సుమారు పదికిపైగా చోరీ సంఘటనలు నమోదయ్యాయి.
సీసీ కెమెరా అలర్ట్‌తో..
సింగరేణి క్వార్టర్స్‌లో 26 బ్లాక్‌లలో కొందరు సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. 26, 6, 4, ఎంసీ, 19, 20 బ్లాక్‌లలో మొత్తం ఆరుగురు ఇళ్లల్లో చోరీ జరిగింది. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే దొంగలు నక్కినక్కి వెళ్తున్నట్లు రికార్డు అయింది. అశోక్ ఇంటి లోపల సీసీ కెమెరాలో ముగ్గురు దొంగలు ఇంట్లో దూరి ఎత్తుకెళ్తున్నట్లు కన్పిస్తోంది. అయితే బయట సీసీ కెమెరా మనుషుల కదలికలను పసిగట్టి ‘అలర్డ్’సైరన్ ఇచ్చింది. జేవీఆర్ ఓసీలో పని చేస్తున్న ఏపీ ఆపరేటర్ రషీద్‌పాషా సీసీ కెమెరాలకు లింక్ చేసి ఉండటం.. అదే సమయంలో అతను విధుల్లో ఉండటంతో ఒక్కసారిగా సీసీ కెమెరాలను పరిశీలించి తోటి కార్మికులకు, పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించడంతో హుటాహుటీన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్మికులు అప్రమత్తం కావటంతో దొంగలు పరారయ్యారు.
క్లూస్ టీమ్ రంగ ప్రవేశం..
పోలీసులు శనివారం రాత్రి అంతా గస్తీని ముమ్మరం చేశారు. సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సిబ్బందితో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్వార్టర్స్ వెనుకవైపు నుంచి ముళ్ల కంచెను కట్ చేసి దొంగలు క్వార్టర్స్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఖమ్మం క్లూస్‌టీం ఆదివారం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు.
దొంగలుపడిన నాలుగు నెలలకు..
దొంగలు పడిన ఆరు నెలలకు పోలీసులు వచ్చిన చందంగా సింగరేణి అధికారులు గత కొంతకాలంగా సింగరేణి కార్మికులు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని పలు దఫాలుగా విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తున్నారు. క్వార్టర్స్ వెనుక అటవీ ప్రాంతం ఉండడంతో ప్రహరీకి విద్యుత్ సరఫరా ఇవ్వాలని చెప్పినా పట్టించుకోకపోవటంపై కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సింగరేణి అధికారులు ఆదివారం సెక్యూరిటీని పెడుతున్నట్లు సెక్యూరిటీ అవుట్‌పోస్టును పెట్టడం గమనార్హం.

మళ్లీ దొంగలు పడ్డారు..