
అంతర్జాతీయ సదస్సుకు న్యాయవాది ఎంపిక
కల్లూరు: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అంతర్జాతీయ సదస్సుకు కల్లూరు పట్టణం అంబేద్కర్‌నగర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఉబ్బన రామకృష్ణ ఎంపికయ్యారు. ఆగస్టు 16న వియత్నం రాజధాని హనోయ్‌లో జరుగనున్న సదస్సులో పాల్గొననున్నారు. ఆదివారం ఖమ్మం ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సేవలను అధికారులు కొనియాడి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టీఎస్ ఏరియా3 డీఆర్‌ఎం కె.శ్రీనివాసరావు, ఖమ్మం డివిజన్ మేనేజర్ ఎ.సంతోష్‌రెడ్డి, యూనిట్ మేనేజర్ కోటా నరసింహారావులు రామకృష్ణను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కిన్నెరసానిలో సండే సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 579 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.32,845 ఆదాయం లభించింది. 360 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.18,640 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణ మిత్రులు, అధికారులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. జలాశయంలో బోటు షికారు చేశారు.
వేతనాలు పెంచాలి
సింగరేణి(కొత్తగూడెం): కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్‌సీసీడబ్ల్యూయూ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూనియన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలోని వివిధ విభాగాల్లో సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో వేతనం రూపాయి కూడా పెంచలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు వేతనాలు పెంచకపోవడంతో పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, రాసుద్దీన్, రాజేశం, బి.అశోక్, మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ఇసుక లారీ పట్టివేత
వైరా: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆంధ్ర నుంచి తరలిస్తున్న ఇసుక లారీని వైరా పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఎస్‌ఐ పి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా తల్లాడ నుంచి వైరా వైపు వస్తున్న లారీని ఆపి పరిశీలించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గమనించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాహన డ్రైవర్ బాలకృష్ణ, యజమాని వెంకటేశ్వరరావు, రవాణాకు సహకరిస్తున్న వైరాకు చెందిన బాణోత్ కృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

అంతర్జాతీయ సదస్సుకు న్యాయవాది ఎంపిక

అంతర్జాతీయ సదస్సుకు న్యాయవాది ఎంపిక