
ఇక కోల్ పర్మిట్లకు అనుమతి..
సత్తుపల్లి: బొగ్గు లోడింగ్‌లపై జరుగుతున్న చర్చ పరిష్కారం దిశగా అడుగులు పడుతుంది. ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో లారీ యజమానుల యూనియన్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. లోకల్, నాన్‌లోకల్ లోడింగ్‌లపై చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు సోమవారం లారీ యూనియన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. లోకల్ సీరియల్‌తో పాటు నాన్‌లోకల్ సీరియల్‌లో కూడా స్థానిక లారీలకు లోడింగ్ ఇచ్చి అవసరమైతే బయట లారీలకు ఇచ్చే కిరాయికే వెళ్లేలా కార్యాచరణపై చర్చించేందుకు సీనియర్ లారీ యజమానులు సిద్ధమవుతున్నారు.
కోల్ ట్రాన్స్‌పోర్టర్‌కే కమిషనా..?
సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీలకు కోల్ ట్రాన్స్‌పోర్టర్లుగా వ్యవహరించే వ్యక్తులు కమీషన్లు తీసుకుంటున్నారనే వస్తున్న ఆరోపణలపై లారీ యజమానుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోల్ ట్రాన్స్‌పోర్టర్ లోడింగ్‌లకే పరిమితమవుతారని, కిరాయి ఎంత, కమీషన్ ఎంత వంటి విషయాలు పట్టించుకోరని, కోల్ ఏజెంట్‌లే ఈ వ్యవహారం అంతా నడుపుతుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి లారీ యూనియన్ కార్యాలయంలో ఆరుగురు కోల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని.. మానవతా ధృక్పథంతో లోడింగ్‌లపై తగు నిర్ణయం తీసుకోవాలని లారీ యూనియన్ మాజీ అధ్యక్షుడు పీ.ఎల్.ప్రసాద్ లారీ యజమానుల గ్రూప్‌ల్లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. బయట లారీలకు ఇచ్చే నాలుగు కిరాయిలను కూడా స్థానిక లారీలకు బొగ్గు లారీలకు అవకాశం కల్పించాలని కోరారు.
సరికొత్త ఎత్తుగడలు..
కమీషన్లపై బహిరంగంగా మాట్లాడుతున్న లారీ యజమానులకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకల్‌కు ఏడు, నాన్‌లోకల్‌కు 4 శాతం చొప్పున లోడింగ్‌లకు అడ్డు చెపితే.. కోల్ పర్మిట్లు రాకుండా అడ్డుకుంటామంటూ ఏజెంట్లు నయానా.. బయనా లొంగదీసుకునేందుకు సరికొత్త ఎత్తుగడలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నాన్‌లోకల్‌కు అనుమతి ఇవ్వకపోతే అసలు లోడింగే ఇవ్వకుండా చూస్తామంటూ కొందరు ఏజెంట్లు లారీ యజమానుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది.
లోకల్, నాన్‌లోకల్ లోడింగ్‌పై చర్చ
నేడు లారీ యూనియన్ సర్వసభ్య సమావేశం