‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
● జూన్ 3 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు ● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి ● అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి
ఖమ్మం సహకారనగర్ : ధరణి చట్టాన్ని రద్దు చేసి ప్రజలు మెచ్చే భూ భారతిని తీసుకొచ్చామని, ఈ చట్టంతో సమస్యలు పరిష్కారం కానున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. భూభారతి చట్టం విధి విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో తాను పర్యటించానని, అన్ని ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ చట్టంపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాలకు వెళ్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇస్తున్నామని, అందులో 1.95 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశామని తెలిపారు. మిగతా 2.55 లక్షల మంది లబ్ధిదారులను ఈ నెలాఖరుకు ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 9,800 చెంచు, చెంచు ఉపకులాల కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజనులకు అదనంగా మరో 10వేల ఇళ్లు ఇస్తామన్నారు. జూన్ 2 నాటికి కనీసం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఎవరైనా సిద్ధంగా లేకుంటే వారి నుంచి అంగీకారం తీసుకుని అర్హులైన మరొకరికి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండో విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, జిల్లాకు 17,983 ఇస్తున్నామని ప్రకటించారు. ఇందులో 12,276 ఇళ్లకు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటివరకు 7,212 ఇళ్లకు ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదం లభించిందని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల జాబితా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేయాలని చెప్పారు.
మండలాల్లో అవగాహన సదస్సులు..
భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా నేలకొండపల్లిని ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహించామని, భూ సమస్యలపై 3,264 దరఖాస్తులు స్వీకరించగా, అందులో 1,786 సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. రెండో విడతగా బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఎర్రుపాలెం మండలం మూలుగుమాడును రీ సర్వేకు పైల ట్ గ్రామంగా ఎంపిక చేశామని చెప్పారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో సర్వే కోసం రెండు టీమ్‌ల చొప్పున సిద్ధం చేయాలని సూచించా రు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మి ల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల వేగవంతానికి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, భూ భారతి పైలట్ మండలాల్లో భూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, ఆర్డీఓలు నర్సింహారా వు, రాజేందర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


